మోత గ్యారెంటీ: మొబైల్ మార్కెట్ పై కరోనా దెబ్బ

కరోనా లాక్ డౌన్ తర్వాత దాదాపుగా అన్ని వస్తువుల రేట్లలో భారీ పెరుగుదల ఉంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నాం కూడా. అయితే వీటన్నిటిలో టాప్ సెల్ పోన్లు అనే విషయం మాత్రం…

కరోనా లాక్ డౌన్ తర్వాత దాదాపుగా అన్ని వస్తువుల రేట్లలో భారీ పెరుగుదల ఉంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నాం కూడా. అయితే వీటన్నిటిలో టాప్ సెల్ పోన్లు అనే విషయం మాత్రం లాక్ డౌన్ తర్వాతే మనకి అనుభవంలోకి రానుంది. సెల్ ఫోన్ రేట్లను భారీగా పెంచేందుకు కంపెనీలన్నీ రెడీ అయ్యాయి.  

నెలరోజుల లాక్ డౌన్ తో ఇప్పటికే భారత్ లో దాదాపు 30శాతం స్మార్ట్ ఫోన్లలో సమస్యలు తలెత్తాయి. ఇక ఇంట్లో పిల్లల కారణంగా పగిలిపోయిన స్క్రీన్ లకు లెక్కే లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే వీటిని అదే రోజు రిపేర్ చేయించుకునేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ షాపులు తెరవడంలేదు, కొత్త ఫోన్లు కొందామన్నా ఆన్ లైన్, ఆఫ్ లైన్ బిజినెస్ లు రెండూ మూతపడే ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ తర్వాత వినియోగదారుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి.

నిజానికి లాక్ డౌన్ కి ముందే భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. చైనాలో కరోనా ప్రభావం ఉండటంతో దిగుమతులపై నిషేధం ఉంది. దీంతో సెల్ ఫోన్ విడిభాగాల రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఫోన్ డిస్ ప్లే పోయింది అంటే.. కొత్త ఫోన్ కొనుక్కోవడమే మేలు అనే పరిస్థితి వచ్చేసింది. లాక్ డౌన్ తర్వాత కూడా చైనా నుంచి దిగుమతులు ఊపందుకునేలా లేవు. ఒకవేళ వచ్చినా కూడా రేట్లు భారీగా పెరగడం గ్యారెంటీ. అందుకే విడిభాగాల ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతింటుందని విశ్లేషకుల అభిప్రాయం.

దీనికితోడు సెల్ ఫోన్లు, విడిభాగాలపై కేంద్రం పెంచిన జీఎస్టీ మూలిగే నక్కపై తాటిపండులా పడుతోంది. ఇప్పటివరకూ సెల్ ఫోన్ల దిగుమతులపై ఉన్న 12శాతం జీఎస్టీ.. ఏప్రిల్-1 నుంచి 18 శాతానికి పెరిగింది. దీనికితోడు రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. అంటే విదేశీ దిగుమతులు మరింత కాస్ట్ లీగా మారిపోతాయన్నమాట. లాక్ డౌన్ వల్ల దిగుమతులే లేక, షాపులు తెరవలేదు కాబట్టి ఈ ఎఫెక్ట్ మనకింకా తెలియలేదు. తెలిసే కాలం ముందుంది.

ఇప్పటికే యాపిల్, శాంసంగ్ సహా దాదాపు అన్ని కంపెనీలు కొత్త రేట్లపై హింటిచ్చేశాయి. 2019లో బాగా సేల్ అయిన ఐఫోన్-11 మోడల్ రేటు మార్చి 2 నుంచే 1300 పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఈ రేటుని మరోసారి కంపెనీ సమీక్షిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ రేటు ఏకంగా 6,100 రూపాయలు పెరగనుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ కొత్త రేట్లు లాక్ డౌన్ తర్వాత 52,500(54జీబీ) 57,800(128జీబీ) గా పెరగబోతున్నాయి.

ఇక శాంసంగ్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. శాంసంగ్ గెలాక్సీ ఎం-21 సిరీస్ రేటు ఏప్రిల్ 1నుంచి పెరగాల్సి ఉంది, లాక్ డౌన్ తర్వాత మరింత వడ్డించే ఆలోచనలో కంపెనీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్-20 అల్ట్రా ఖరీదు 5,090 రూపాయలు పెరుగుతోంది. ఇండియాలో టాప్ బ్రాండ్ గా ఉన్న షియోమీ కూడా జీఎస్టీ మార్పుకి అనుగుణంగా ఏప్రిల్-1నుంచి రేట్లు పెంచడానికి సిద్ధమైంది. లాక్ డౌన్ తర్వాత ఈ పెంపుదలకు అదనంగా మరింత మోత జోడించనుంది. రూపాయి మారకంలో వచ్చిన తేడా కూడా దీనిపై ప్రభావం చూపించే అవకాశముంది.

2018 నుంచి తమ ఫోన్ల రేట్లను పెంచని రియల్ మి ఇప్పుడు పెంచడానికి సిద్ధమవుతోంది. ఒప్పో, వివో అధికారంకంగా రేటు పెంచే నిర్ణయాన్ని ప్రకటించకపోయినా ముంబైలోని రిటైలర్లకు మాత్రం వడ్డింపులపై సమాచారం వచ్చేసింది.

మొత్తమ్మీద ఇండియాలో మొబైల్ డేటా రేట్లు జియో ముందు, జియో తర్వాత అన్నట్టుగా.. సెల్ ఫోన్ల రేట్లు లాక్ డౌన్ ముందు, లాక్ డౌన్ తర్వాత అన్నంతగా పెరగబోతున్నాయి. జీఎస్టీలో పెంపుదల అనేది చాలా చిన్న విషయం, మార్కెట్ లో బలంగా నిలబడాలనుకునే కంపెనీలు ఆ పెంపుని కస్టమర్లపై వేయాలనుకోవు, తామే భరిస్తాయి. కానీ లాక్ డౌన్ ప్రభావం మాత్రం ఈ విదేశీ కంపెనీలపై గట్టిగా పడేలా ఉంది.

పోటీ సంగతి పక్కనపెట్టి ముందు మనుగడ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే అన్నీ మూకుమ్మడిగా రేట్లు పెంచేయబోతున్నాయి. ఇప్పటివరకూ చిన్న చిన్న కారణాలతో సెల్ ఫోన్లను మార్చేస్తున్న సగటు భారతీయ వినియోగదారుడు.. ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి రాబోతోంది.

ఇన్ని వేషాలు అవసరమా నిమ్మగడ్డా