కార్తీకమాసం మొదలైంది. తొలి సోమవారం వచ్చేసింది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సందడి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దీనికి కారణం కరోనా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్, కార్తీకమాసంపై కూడా తన ప్రభావం చూపించింది.
కరోనాకు భయపడి చాలామంది భక్తులు దేవాలయాలకు రావడం తగ్గించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని శివ క్షేత్రాల్లో భక్తుల తాకిడి సాధారణంగానే ఉంది.
కార్తీకమాసంలో నదీస్నానం, సముద్ర స్నానాన్ని పుణ్యంగా భావిస్తారు భక్తులు. అయితే ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో నది-సముద్ర స్నానాల్ని అధికారులు నిషేధించారు. అయితే తూర్పుగోదావరి, కృష్ణా, వరంగల్, శ్రీశైలం, విశాఖ లాంటి ప్రాంతాల్లో మాత్రం కొంతమంది ఆంక్షల్ని పక్కనపెట్టి స్నానాలు ఆచరించారు.
ఇక ఉభయ రాష్ట్రాల్లోని చాలా దేవాలయాల్లో భౌతిక దూరం దాదాపు కనుమరుగైంది. భక్తులంతా క్యూ లైన్లలో తోసుకుంటూ దైవదర్శనం చేసుకోవడం కనిపించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్యూ లైన్లలో మార్కింగ్ వేసినప్పటికీ వాటిని పట్టించుకున్న భక్తుడు లేడు. ఉన్నంతలో మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. దాదాపు భక్తులంతా మాస్కులు ధరించారు.
అయితే ఎన్ని మాస్కులు ధరించినా.. భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా అభిషేకాలు చేసినప్పుడు, ప్రసాదం-తీర్థం స్వీకరించినప్పుడు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. అలాంటి ముందుజాగ్రత్తలేవీ కనిపించలేదు.
ఈసారి కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి. మొదటి, మూడో సోమవారాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సామూహిక స్నానాలు చేయొద్దని సూచిస్తున్నారు.