సెప్టెంబర్ ప్రథమార్థానికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కనీసం పది లక్షలు ఉంటుందని కొన్ని పరిశోధన సంస్థలు అంచనా వేశాయి. దాదాపు నెల కిందట అలాంటి అంచనాలను వెలువరించాయి. దేశంలో అలా కరోనా పీక్స్ కు చేరుతుందని అవి అభిప్రాయపడ్డాయి. అయితే అలాంటి పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యకు సంబంధించిన గ్రాఫ్ కూడా కాస్త కింద పడుతూ, మరి కాస్త లేస్తూ ఉంది.
స్థూలంగా ఆగస్టు చివరి వారంలో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షల వరకూ ఉంది. అయితే గత వారం పది రోజుల నుంచి రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుదల పెద్దగా లేదు. కొత్తగా నమోదవుతున్న కేసులకు ధీటుగా రికవరీ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో యాక్టివ్ పేషెంట్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదు. రోజుకు నాలుగైదు వేలు, ఆరు వేలు, ఒక్కో రోజు పది వేల వరకూ కూడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఒక్కో రోజు కొత్తగా రిజిస్టర్ అయిన కేసుల కన్నా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగైదు వేల స్థాయిలో తగ్గింది.
దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షల వరకూ చేరే అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే రికవరీ రేటు 75 శాతాన్ని దాటేసింది. 75 శాతం రికవరీ నమోదు అయిన చాలా దేశాల్లో ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన దాఖలాలున్నాయి. భారత దేశ రాజధాని ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితే నమోదైంది. ఢిల్లీలో రికవరీ రేటు బాగా పెరిగాకా.. క్రమంగా కరోనా కొత్త కేసుల రిజిస్టర్ కావడం కూడా తగ్గింది.
కరోనా రికవరీ శాతం 75 దాటాకా ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 10 వేల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కూడా కొత్త కేసులు అయితే వస్తున్నాయి, అందుకు తగ్గట్టుగా రికవరీలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య స్థిరంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో రికవరీ శాతం 90 ని దాటినట్టుగా ఉంది. హాస్పిటల్స్ లో ఉంటున్న కరోనా పేషెంట్ల సంఖ్య చాలా తక్కువ అక్కడ. బహుశా ఢిల్లీ తరహాలోనే మిగతా ఇండియాలో కూడా అతి త్వరలోనే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఆశించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.