ప్రస్తుతం ఇండియా సెకెండ్ వేవ్ లో ఉంది. కరోనా లక్షణాలేంటనే విషయంపై చాలామందికి అవగాహన ఉంది. అయితే సెకెండ్ వేవ్ లో పిల్లలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ల లక్షణాల్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. దీంతో చాలమంది చిన్నారుల పరిస్థితి విషమంగా తయారవుతోంది. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
2 నెలల నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరోనా లక్షణాలు ఏ స్థాయిలో ఎలా ఉంటాయనే అంశంపై కేంద్రం సూచనలు చేసింది. ఆ లక్షణాల ఆధారంగా పిల్లల్లో కరోనా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని సూచించింది. అంతేకాకుండా.. చిన్నారులకు స్టెరాయిడ్ చికిత్స అందించవచ్చా లేదా అనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది.
గొంతులో నొప్పి, అతిగా ముక్కుకారడం, దగ్గు లాంటి లక్షణాల్ని స్వల్ప శ్రేణి కరోనాగా పరిగణించాలని కేంద్రం సూచించింది. ప్రాధమిక స్థాయి కరోనా లక్షణాల్లో శ్వాస తీసుకోవడం సాధారణంగానే ఉంటుందని స్పష్టంచేసింది. ఇలాంటి పిల్లల్ని హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదని, హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి నయం చేయొచ్చని తెలిపింది. సమతులాహారంతో పాటు పారాసిట్మాల్ డ్రాప్స్ లేదా టానిక్ ఉపయోగించొచ్చని సూచించింది.
ఇక పైన చెప్పుకున్న లక్షణాలతో పాటు శ్వాసలో ఇబ్బంది కలిగితే మాత్రం దాన్ని మోడరేట్ కరోనాగా గుర్తించాలని సూచించింది. 2 నెలల పసికందు నుంచి 5 ఏళ్ల చిన్నారుల్లో శ్వాస తీసుకోవడంలో హెచ్చుతగ్గులుంటాయని.. వయసు ఏదైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని, ఇంట్లో చికిత్స పనికిరాదని స్పష్టంచేసింది కేంద్రం. ఇటువంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారుల్లో ఆక్సిజన్ శాతం 94శాతం కంటే తక్కువగా ఉంటే, ఆక్సిజన్ అందించడంతో పాటు తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వొచ్చని తెలిపింది.
ఇక న్యూమోనియా తీవ్రంగా ఉండడం, ఆక్సిజన్ 90శాతం కంటే తక్కువకు పడిపోవడం, శ్వాస తీసుకుంటున్నప్పుడు గస లాంటి శబ్దాలు రావడం, గుండెలో నొప్పి, అతిగా నిద్ర మత్తులోకి జారుకోవడం, తిన్నది ఏదైనా కక్కేయడం, హఠాత్తుగా మూర్ఛపోవడం లాంటి లక్షణాల్ని కరోనా తీవ్రస్థాయిగా గుర్తించాలి. ఇలాంటి పిల్లల్ని వెంటనే ఐసీయూలో చేర్పించాలి. వాళ్ల శరీర బరువుకు తగ్గట్టు స్టెరాయిడ్స్ ఇవ్వాలి. ఇక రెమిడిసివర్ ఇంజెక్షన్ కు సంబంధించి పిల్లల ట్రయల్ డేటా అందుబాటులో లేనప్పటికీ.. వాళ్ల శరీర బరువు, లక్షణాల తీవ్రత బట్టి వైద్యులు డోసేజ్ నిర్ణయించి ఇవ్వొచ్చని కేంద్రం తెలిపింది.
మొదటి దశలో కేవలం 4 శాతంమంది పిల్లల్లో మాత్రమే కరోనా బయటపడిందని తెలిపిన కేంద్రం.. సెకెండ్ వేవ్ లో మాత్రం 15 నుంచి 20 శాతం మంది పిల్లలు కరోనా ప్రభావానికి లోనైనట్టు తెలిపింది. ఇక థర్డ్ వేవ్ లో పిల్లలకు మరింత ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పై లక్షణాల ఆధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలని కేంద్రం హెచ్చరించింది.