తెలుగు మీడియా సంస్థల్లో కరోనా కలకలం

కరోనా సమయంలో తెలుగు మీడియా ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో గ్రేట్ ఆంధ్ర గతంలోనే చెప్పింది. వందల సంఖ్యలో ఉద్యోగుల్ని పీకి పడేయడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులకు సరైన ఏర్పాట్లు చేయక తన కర్కశత్వాన్ని చూపించింది.…

కరోనా సమయంలో తెలుగు మీడియా ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో గ్రేట్ ఆంధ్ర గతంలోనే చెప్పింది. వందల సంఖ్యలో ఉద్యోగుల్ని పీకి పడేయడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులకు సరైన ఏర్పాట్లు చేయక తన కర్కశత్వాన్ని చూపించింది. పీపీఈ కిట్ల మాట దేవుడెరుగు.. కనీసం డెస్కుల్లో హ్యాండ్ శానిటైజర్లు కూడా ఏర్పాటుచేయని దారుణమైన పరిస్థితులు తెలుగు మీడియా సంస్థల్లో ఉన్నాయి. “నీ చావు నువ్వు చావు” అన్నట్టు మీడియా సంస్థలు తయారయ్యాయి.

కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు మీడియా సంస్థల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. మొన్నటికిమొన్న టీవీ5 ఛానెల్ రిపోర్టర్ కరోనాతో మృతిచెందాడు. అంతకంటే ముందే మరో ఛానెల్ లో ఓ వ్యక్తికి కరోనా సోకింది. అయితే ఆ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలన్నీ కావాలనే తొక్కిపెట్టాయి. ఎప్పుడైతే ఓ మరణం సంభవించిందో అప్పుడిక సదరు సంస్థలు కూడా విషయాన్ని దాచిపెట్టలేకపోయాయి.

టీవీ5 రిపోర్టర్ మరణంతో ఛానెళ్లు ఇప్పుడు జాగ్రత్తల్లో పడ్డాయి. మీడియాలో కరోనా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యూస్ ఛానెల్ ఎన్టీవీలో తాజాగా మరో కరోనా కేసు బయటపడింది. దీంతో అతడ్ని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు, మరికొంతమంది ఛానెల్ సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ లో పెట్టారు.

ఇక టీవీ9 సిబ్బందిలో కూడా ఒకరికి కరోనా సోకింది. దీంతో భవనంలో అతడు పనిచేస్తున్న ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. అందర్నీ హోం క్వారంటైన్ లో ఉండమని చెప్పి, ఆ ఫ్లోర్ కు తాళం వేశారు. అంతేకాదు.. అదే భవనంలో మరో అంతస్తును కూడా ఖాళీ చేయించినట్టు సమాచారం.

ప్రస్తుతానికి బయటపడిన ఉదంతాలు కొన్ని మాత్రమే. కప్పిపుచ్చుతున్న వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి మీడియా సంస్థల్లో కరోనా కలకలం ఇప్పటిది కాదు. ఏప్రిల్ లోనే ముంబయి, చెన్నైలోని కొన్ని మీడియా సంస్థల్లో కరోనా బయటపడింది. పదుల సంఖ్యలో మీడియా ప్రతినిథులకు కరోనా సోకింది. అప్పుడే స్థానిక తెలుగు మీడియా సంస్థలు అదనపు జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇకనైనా మీడియా సంస్థలు మొద్దునిద్ర వీడాలి. ఉద్యోగుల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు