కరోనా కాలం.. ఆస్పత్రి బెడ్లకూ రికమండేషన్

ఏదైనా జరగరానిది జరిగితే కలికాలం అనుకుంటాం. అలాంటివన్నీ ఇప్పుడు కరోనా కాలంలో జరుగుతున్నాయి. మానవ సంబంధాలు మంటగలిసిపోయాయి, మృతదేహాల పట్ల కనీస మానవత్వం లేకుండా రక్త సంబంధీకులే మొహం చాటేస్తున్నారు. గతంలో కాలేజీ సీటుకోసమో,…

ఏదైనా జరగరానిది జరిగితే కలికాలం అనుకుంటాం. అలాంటివన్నీ ఇప్పుడు కరోనా కాలంలో జరుగుతున్నాయి. మానవ సంబంధాలు మంటగలిసిపోయాయి, మృతదేహాల పట్ల కనీస మానవత్వం లేకుండా రక్త సంబంధీకులే మొహం చాటేస్తున్నారు. గతంలో కాలేజీ సీటుకోసమో, ఉద్యోగం కోసమో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు రికమండేషన్లు చేసేవారు. కరోనా కాలంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఇలా రికమండేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి.

ఇటీవల కార్పొరేట్ ఆస్పత్రులకు కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న ఆస్పత్రి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఓ మోస్తరు ఆస్పత్రిలో 20 బెడ్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 50 నుంచి 70 బెడ్లు కరోనా రోగుల కోసం కేటాయించారు. అయితే ఈ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ కి తగ్గట్టు ఆస్పత్రుల్లో రోజుకి 20వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు.

విచిత్రం ఏంటంటే.. కరోనా లక్షణాలు తగ్గిపోయినా కూడా ఎవరూ డిశ్చార్జి కావడానికి ఆసక్తి చూపించడంలేదట. దీంతో కొత్తగా వచ్చే రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండవనే కారణంగా ఓ మోస్తరు డబ్బున్న జనాలంతా ప్రైవేట్ ఆస్పత్రులవైపే మొగ్గు చూపుతున్నారు. కానీ బెడ్లు ఉండటంలేదు. మంత్రుల స్థాయిలో రికమండేషన్లు చేయిస్తున్నా కూడా ఫలితం ఉండటంలేదు.

రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కొవిడ్ కేర్ సెంటర్లో ఒక్కో కరోనా రోగి నుంచి రోజుకి 20వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ప్రభుత్వ అధికారుల కమిటీ నివేదికలో తేల్చింది. అగ్నిప్రమాదంతో అసలు విషయం బైటపడింది కానీ లేకపోతే ఎప్పటికీ ఈ అధిక ఫీజుల వ్యవహారం బైటకొచ్చేది కాదు. ఇక తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ స్థాయిలో బిల్లులు వేస్తున్నప్పటికీ.. చాలా చోట్ల పల్మనాలజిస్ట్ ల కొరత ఉంది. వైద్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. పీజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తో వైద్యం చేయిస్తున్నారు. ప్రత్యేకంగా కరోనా వార్డుల్లో ఉండేందుకు రోజుకి 50వేల చొప్పున వీరికి చెల్లిస్తున్నారు. మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండటంతో.. ఫీజులు కూడా భారీగానే వసూలు చేయాల్సి వస్తోందనేది కార్పొరేట్ ఆస్పత్రుల వాదన.

మొత్తమ్మీద ఈ కరోనా కాలంలో.. ఆస్పత్రి బెడ్స్ కి కూడా రికమండేషన్లు చేయించుకోవాల్సిన దుస్థితి. మీకు నయమైపోయింది ఇక ఇంటికి వెళ్లండి అన్నా కూడా రోగులు భయంతో అక్కడే ఉంటున్న పరిస్థితి. 

హైద్రాబాదులో నీ ఘనకార్యాలు అవేనా

ఆర్‌కే రాత‌ల‌కు అర్థాలే వేరులే