బాలీవుడ్ లో నెపొటిజం, ఇన్ సైడర్స్ వర్సెస్ ఔట్ సైడర్స్.. వంటి అంశాల గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం గురించి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. బాలీవుడ్ పూర్తిగా వారసుల రాజ్యంగా మారిందని అక్కడి హీరోయిన్లు కొందరు ఆరోపించారు. కొందరు దర్శకులు, నిర్మాతలు కేవలం వారసులకు, తమకు తెలిసిన వారికే అవకాశాలు ఇస్తారని, బయటి వాళ్లను ప్రోత్సహించారని, ఇలా బాలీవుడ్ లో ఒక మాఫియా ఏర్పడిందని వారు వ్యాఖ్యానించారు.
అలాంటి పరిస్థితుల్లోనే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో నెపొటిజంపై చర్చ మరింత వేడెక్కింది. బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతి వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా లాంటి వాళ్లు వ్యాఖ్యానించారు. తన వాదన కోసం ఆమె సుశాంత్ ఆత్మహత్యను ఉపయోగించుకుంటోందనే వాదనలూ వినిపించాయి. ఆమె కర్కశంగా వ్యవహరిస్తోందని తాప్సీ లాంటి వాళ్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇలా బాలీవుడ్ లో బంధుప్రీతిపై చర్చ కొనసాగుతూ ఉంది.
ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్ధిన్ షా ఈ అంశం పై స్పందించారు. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ.. బాలీవుడ్ లో మూవీ మాఫియా అంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. బంధుప్రీతి- వారసత్వం అంశంపై స్పందిస్తూ.. ఒక డాక్టర్ తన వారసులను డాక్టర్ గా చూడాలనుకుంటాడని, లాయర్ కొడుకులు లాయర్లు అవుతుంటారని, పారిశ్రామికవేత్తల కొడుకులు పారిశ్రామిక వేత్తలు అవుతుంటారని.. అలాంటప్పుడు నటులు తమ వారసులను నటులుగా చేసుకోవడం ఎలా తప్పవుతుందని నసీర్ ప్రశ్నించారు.
స్టార్ట్ ల వారసులు స్టార్లు కావడం అనేది వారి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇతర వ్యాఖ్యానాలు అన్నీ కేవలం ఊహాజనితం అని ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ లో మూవీ మాఫియా ఉందనేది కేవలం ఊహాజనిత ఆలోచన ఆయన వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో దశాబ్దాల గమనాన్ని కలిగి ఉన్న నసీరుద్దీన్ షా ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.