ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటీష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్న కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సిన్ విషయంలో మరో సానుకూల విషయాన్ని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో తొలి దశ విజయవంతం అయ్యిందని ఇప్పటికే ఈ సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు మరో దశలో ప్రయోగం విజయవంతం అయితే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినట్టే అని ఈ సంస్థలు చెబుతున్నాయి.
ఈ దశలో మొత్తం 10 వేల మందికి పైగా ఆరోగ్యవంతమైన వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారట. ఇప్పటికే వారి ఎంపిక పూర్తి అయ్యిందని, వారిపై వ్యాక్సిన్ విజయవంతం అయితే.. కరోనాకు మందు అందుబాటులోకి వచ్చేసినట్టే అని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ దశలో ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ఆశాజనకమైన విషయాన్ని చెబుతూ ఉంది.
పది కోట్ల డోసులతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా కూడా వివరించింది. వ్యాక్సిన్ విషయంలో తమ లాభాపేక్ష లేదని, ప్రపంచాన్ని విపత్తు నుంచి కాపాడటమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.
వివిధ వయసుల్లోని వలంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తూ ఉండటంతో పనితీరుపై పూర్తి స్పష్టత వస్తుందని ఈ అధ్యయన సంస్థ పేర్కొంటోంది. కరోనా విరుగుడు యాంటీబాడీస్ ను జనింపజేయడమే ఈ వ్యాక్సిన్ లక్ష్యం. ఆరోగ్యవంతుల్లో ఈ పరిశీలన చేయనున్నారు. ఈ దశలో ప్రయోగం విజయవంతం అయితే.. కరోనా వైరస్ సోకిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అధ్యయన సంస్థలు చెబుతున్నాయి.