ఒకే ఒక్క యాక్సిడెంట్ ఆ బాలీవుడ్ నటి కెరీర్ను సర్వనాశనం చేసింది. ఆ బాధిత నటి మహిమా చౌదరి. ఆమె జీవితంలోనే ఓ పీడ కలగా మిగిలిన రోజది. తన జీవితాన్ని ఆ యాక్సిడెంట్ సర్వనాశనం చేసిందని ఆమె ఆవేదనతో చెప్పుకొచ్చారు. బతకడం కోసం శక్తిని కూడగట్టుకుని పోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కష్ట సమయంలో మన అనేవాళ్లెవరో ఆ సమయాన తెలిసొచ్చిందన్నారు.
లాక్డౌన్ వేళలో సోషల్ మీడియా వేదికగా మహిమా మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పుకొచ్చారు. నిజంగా ఆమె చెప్పేవి వింటుంటే జీవితంలో ఎంత విషాదం ఉందో అర్థమవుతుంది. ఇంతకూ ఆమె ఏం చెప్పారంటే…
‘నేను కాజోల్, అజయ్ దేవగణ్ల సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘దిల్ క్యా కరే’ చిత్రం కోసం పని చేస్తున్న రోజులవి. బెంగళూరులో షూటింగ్ . స్టూడియోకు కార్లో బయల్దేరాను. ఇంతలో ఊహించని షాకింగ్. ఓ ట్రక్కు నా కారును ఢీకొట్టింది. గ్లాస్ మొత్తం నా ముఖం లోపలకు వెళ్లినట్లు అనిపించింది. నేను చనిపోతున్నానని అనుకున్నాను. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఏ ఒక్కరూ సాయపడలేదు. ఎలాగోలా నేను ఆసుపత్రికి చేరుకున్న చాలా సేపటి తరువాత నా తల్లి, అజయ్ వచ్చారు. నేను లేచి అద్దంలో నా ముఖం చూసుకుని భయపడ్డాను. డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి 67 గాజు ముక్కలను తొలగించారు’ అని చెప్పుకొచ్చారు.
ఇంకా ఆమె తన ఆవేదనంతా వెల్లగక్కారు. సమాజం ఇంత అమానవీయంగా ఉందా అని ఆమె మాటలు వింటుంటే అనిపించక మానదు. యాక్సిడెంట్ నాటి జ్ఞాపకాలను మహిమా చౌదరి ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చారు.
‘నిజం చెప్పాలంటే నేను చచ్చి బతికాను. ఆ ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు ఏడ్పు వస్తుంది. ఆపరేషన్ తర్వాత నా ముఖం మీద కుట్లు ఉన్నాయి. సూర్యరశ్మి తగలకూడదని డాక్టర్లు చెప్పడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. నా గది పూర్తిగా చీకటితో నిండి ఉండేది. కనీసం అద్దం కూడా ఉండేది కాదు ’ అని గుర్తు చేసుకున్నారు.
‘యాక్సిడెంట్ సమయంలో నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని నేను వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నాకు మద్దతుగా నిలవలేదు. ‘ఆమె ముఖం నాశనం అయ్యింది.. ఆమెను తీసేసి మరొకరిని తీసుకుందాం’ అని జనం భావించారు. దాంతో నేను ఆ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అని ఎంతో ఆవేదనతో మహిమా చౌదరి చెప్పుకొచ్చారు. సాఫీగా సాగిపోతున్న కెరీర్లో ఓ యాక్సిడెంట్ ఎలా మలుపు తిప్పిందో ఆమె జీవితం ఓ సినిమా కథను తలపించిందనడంలో అతిశయోక్తి లేదు.