కరోనా నివారణకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ పై ప్రయోగాలను అత్యంత విస్తృతంగా చేస్తున్నట్టుగా ప్రకటించారు. కేవలం బ్రిటన్ లోనే కాకుండా.. వేరే దేశాల్లో కూడా వలంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ సాగుతున్నాయని ఆ సంస్థ తాజా అప్ డేట్ ను ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ కు తమ టీకాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా ఇది వరకే ఆ సంస్థ ప్రకటించింది. ఆ మేరకు ఇప్పుడు మరోసారి అందుకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది. చింపాజీలపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని ఆ సంస్థ ఇది వరకే ప్రకటించింది. ఆ తర్వాత మానవులపై ప్రయోగాలను కొనసాగిస్తూ ఉంది. ఒక్కో దశలో కొంతమంది మీద ప్రయోగాలను నిర్వహిస్తోంది.
నంబర్ ను పెంచుకుంటూ పోతూ ఫలితాలను గమనిస్తున్నట్టుగా పరిశోధకులు వివరిస్తున్నారు. బ్రిటన్ లో మాత్రమే కాకుండా.. బ్రెజిల్ లో కూడా కొంతమంది వలంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ ను పయోగించారట. అలాగే దక్షిణాఫ్రికాలోనూ కొంతమంది పై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారట. ఇక తుదిదశ ప్రయోగాలు మాత్రమే మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ దశలో భారీ ఎత్తున చాలా మంది పై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తారట. బ్రిటన్ లో ఇప్పటి వరకూ నాలుగు వేల మంది వలంటీర్లు ముందుకు వచ్చారని, మరో పది వేల మంది మీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి.. ఫలితాలను సమీక్షించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫలితాలపై ఆగస్టు, సెప్టెంబర్ కళ్లా క్లారిటీ సమీక్ష పూర్తవుతుందని, అక్టోబర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా పరిశోధకులు వివరిస్తున్నారు. ఒకే సారి మూడు కోట్ల డోసుల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారట.