సోషల్ మీడియా గూటి పక్షి నారా లోకేష్ ఇటీవల కాస్త జనాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించడం అనే కంటే.. బలవంతం మీద బయటకొస్తున్నారనుకోవాలి. చంద్రబాబు నిర్ణయంతో పాటు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే లోకేష్ పరామర్శల పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి వచ్చిన ఆయన, ఇప్పుడు అచ్చెన్నాయుడి కుటుంబానికి ఓదార్పు ఇవ్వడం కోసం నిమ్మాడ వెళ్తున్నారు.
వాస్తవానికి నిమ్మాడ టూర్ లోకేష్ కి ఇష్టంలేదట. తాడిపత్రి వెళ్లొచ్చినందుకే అక్కడ జనాల్ని పోగుచేశారంటూ కొన్ని కేసులు నమోదయ్యాయి, ఇప్పుడు నిమ్మాడ వెళ్తే, తనని ఎక్కడ స్టేషన్లో నెడతారోనని లోకేష్ భయపడ్డారట. అదే జరిగితే మంచి పబ్లిసిటీ వస్తుంది పొమ్మంటూ హుకుం జారీ చేశారట చంద్రబాబు.
అటు జేసీ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత శ్రీకాకుళం నుంచి కూడా లోకేష్ పై ఒత్తిడి వచ్చిన మాట వాస్తవం. బీసీలను టార్గెట్ చేశారంటూ సీఎం జగన్ ని తిట్టిపోసే టీడీపీ నేతలు, బీసీ నేత అరెస్ట్ అయితే కనీసం కుటుంబ సభ్యుల్ని అధినాయకత్వం పలకరించే దిక్కులేదా అంటూ వైరి పక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే కాస్త ఆలస్యంగా లోకేష్ కాలు బైటపెట్టబోతున్నారు.
అయితే ఈ యాత్రలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఉన్నాయట. నిమ్మాడలో అచ్చెన్న ఇంటికి వెళ్లే సందర్భంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అక్కడ ఉండకూడదు, ఒకవేళ ఉన్నా.. కార్యకర్తలెవరూ రామ్మోహన్ నాయుడికి అనుకూలంగా నినాదాలు చేయకూడదు. ఇదీ లోకేష్ పెట్టిన కండిషన్. అసలే లోకేష్, రామ్మోహన్ నాయుడు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సందర్భంలో… కొంతమంది కావాలని లోకేష్ ని కించపరిచేందుకు, రామ్మోహన్ నాయుడిని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చినబాబుకి సమాచారం ఉందట. అందుటే ఈ కండిషన్ పెట్టారట.
ఇక రెండోది, అత్యంత ముఖ్యమైనది లోకేష్ భోజనం మెనూ. మెనులో తాను చెప్పిన వంటకాలేవీ మిస్ కాకూడదు, పప్పుతో సహా. ఇక లోకేష్ తింటున్నంత సేపు ఎవరూ సెల్ ఫోన్లు బైటకు తీయకూడదు. ఒక్క ఫొటో బైటకొచ్చినా మర్యాద దక్కదు అని ముందే హెచ్చరించేశారట. జేసీ ఇంట్లో విందు భోజనం ఫొటోలు బైటకొచ్చి పరువు పోవడంతో, నిమ్మాడలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారట లోకేష్.
మొత్తమ్మీద లోకేష్ ముందు జాగ్రత్త చూసి శ్రీకాకుళం జిల్లా నేతలు ముక్కున వేలేసుకున్నారు, భవిష్యత్ లో చినబాబుతో వేగేదెట్టా అని గొణుక్కుంటున్నారు.