కరోనా వైరస్ ఇండియా వంటి దేశంలో విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో అయితే ఏకంగా 48 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయట! ఇలా ఇండియాలో కరోనా విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. ఇది నంబర్లు చెబుతున్న మాట.
ఇదే సమయంలో కరోనా వైరస్ బలహీన పడుతోంది. అయితే బలహీన పడటం వ్యాపించడంలో కాదు.. సోకిన వారిపై ప్రభావం చూపించడంలో.. ఇదీ పరిశోధనల మాట. మొదట్లో కరోనా సోకిన వారిపై ఆ ప్రభావం కనీసం 14 రోజుల పాటు ఉండేదని, ఇప్పుడు కరోనా వైరస్ సోకిన వారు కోలుకునే సమయం గణనీయంగా తగ్గిందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
కొన్ని పరిశోధనల సంస్థల ప్రకారం.. కరోనా నుంచి ఎనిమిది నుంచి 10 రోజుల్లో కోలుకుంటున్నారు చాలా మంది. ఐదో రోజు నుంచి శరీరంలో యాంటీబాడీస్ పని చేయడం ప్రారంభిస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ కట్టడి అవుతోంది… అని ఆ పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి.
ఇండియాలో అయితే కరోనా రోగుల రికవరీ రేటు బాగా పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 33 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రోజుల ట్రీట్ మెంట్ తో చాలా మంది కోలుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. ఇలా రికవరీ రేటు మెరగవుతూ ఉంది. డిశ్చార్జి అయిన వారిని ఇతరులతో కలవకుండా హోంక్వారెంటైన్లో ఉండమని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ గా తేలిన వారిని కలవడానికి వేరే వాళ్లు ఎలాగూ కలవడానికి దూరదూరంగానే ఉంటారు.
ఏతావాతా కరోనా వైరస్ నుంచి కోలుకునే వేగం పెరిగిందని తెలుస్తోంది. ఇది వైరస్ బలహీనతకు సంకేతమని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే.. ఇండియా వంటి దేశంలో కూడా కరోనా వైరస్ కారణ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏ రోజుకారోజు ఈ సంఖ్య పెరుగుతోంది. రికవరీల వేగం పెరిగినా, కరోనా వైరస్ కారణ మరణాల సంఖ్య పెరుగుతుండటం విచారకరం. ఈ సంఖ్య తగ్గితే.. వైరస్ నిజంగానే బలహీన పడిందని అంతా ఒక ధీమాకు రావొచ్చు.