నిన్నటికి నిన్న నెల్లూరులో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. జిల్లాలో ఏకంగా 34కు చేరేసరికి రాష్ట్రస్థాయి అధికారులంతా అటువైపే దృష్టిపెట్టారు. ఇంతలోనే కరోనా మరో జిల్లాలో కోరలుచాచింది. ఈసారి కర్నూల్ కేంద్రంగా కరోనా విజృంభించింది. కర్నూలులో నిన్నటివరకు 4 కేసులే ఉండగా.. ఈరోజు ఉదయం 23 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మందికి పాజిటివ్ అని నిర్థారణ అవ్వడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది.
తాజా రిపోర్టులతో కర్నులులో కేసుల సంఖ్య అమాంతం 53కు పెరిగిపోయింది. నిన్నటివరకు రాష్ట్రంలో అత్యథిక కరోనా కేసులున్న జిల్లాలుగా కృష్ణా, నెల్లూరు నిలవగా.. ఇప్పుడు కొన్ని గంటల వ్యవథిలోనే కర్నూలు నంబర్ వన్ స్థానానికి ఎగబాకి, అందర్నీ ఆందోళనలో పడేసింది.
నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు రిలీజైన ఫలితాల్లో 34 కేసులు పాజిటివ్ కాగా.. అందులో 23 కేసులు కర్నూలులోనే ఉన్నాయి. తాజాగా సాయంత్రం రిలీజైన ఫలితాల్లో ఇదే జిల్లా నుంచి మరో 26 కేసులు బయటపడ్డంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజా ఫలితాలతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది.
అటు దేశవ్యాప్తంగా ఈరోజు సాయంత్రం 7 గంటల సరికి కరోనా కేసుల సంఖ్య 3374కు చేరినట్టు, 79 మంది మృతి చెందినట్టు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మతప్రార్థనలకు వెళ్లి స్వస్థలాలకు చేరుకున్న వ్యక్తుల కారణంగానే అమాంతం కరోనా కేసులు పెరిగినట్టు కేంద్రం ప్రకటించింది. రాబోయే 2 వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. తాజాగా పెరిగిన కేసులు, కేంద్రం ప్రకటనను పరిశీలిస్తే.. దేశంలో లాక్ డౌన్ ను మరో వారం పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.