సామాజిక వ్యాప్తి.. కరోనా వైరస్ విషయంలో ప్రపంచం భయపడుతున్నది ఈ విషయంలోనే. ఎవరి నుంచి ఎవరికి అంటుకుందో తెలియని పరిస్థితే ఈ సామాజిక వ్యాప్తి. కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించినప్పుడు వారికి అది ఎవరి నుంచి సోకిందనే విషయంపై స్పష్టత లేకపోతే దాన్ని సామాజిక వ్యాప్తే అనుకోవాలి. అయితే ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా సామాజిక వ్యాప్తి దశలో లేదని అంటోంది భారత ప్రభుత్వం. ఐసీఎంఆర్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
దేశంలో ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 2,86,579కి చేరింది. రోజువారీగా 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లాక్ డౌన్ నిబంధనలను ఎత్తేస్తున్న దశలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ ఉంది. వారం పది రోజుల కిందట లాక్ డౌన్ నిబంధనలు అంతో ఇంతో ఉండేవి. ఎనిమిదో తేదీ నుంచి మరిన్ని మినహాయింపులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ వీక్ లో పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ క్రమంలో ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే.. ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వ్యక్తులతో అతి సన్నిహితంగా మెలిగిన వారికే ఆ వైరస్ సోకుతోంది. సామాజిక వ్యాప్తి లేదట. అలాగే ఇండియాలో కరోనా వైరస్ కారణ మరణాల రేటు కూడా బాగా తక్కువ అని ఐసీఎంఆర్ తేల్చి చెబుతోంది. ఇండియా కరోనా వైరస్ కారణ మరణాల రేటు 2.8 శాతమని భారత వైద్య పరిశోధన మండలి వివరిస్తూ ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇది తక్కువని చెబుతోంది ఆ సంస్థ. ఇండియాలో ఇప్పటి వరకూ రివకరీ రేటు 49 శాతం వరకూ ఉందని ఇది కూడా సానుకూలాంశమే అని అంటోంది.