ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే వరకూ కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అసలైన విషయం ఏమిటంటే.. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా వాటిల్లో సింప్టమ్స్ బయటపడటం తగ్గిపోతూ ఉందనేది. అందుకు ఉదాహరణగా అనేక కేసులను ప్రస్తావిస్తున్నారు వైద్యనిపుణులు, పరిశీలకులు.
బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి. ప్రస్తుతం వాళ్లకు తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లే పరిస్థితి ఉందట. దీంతో వారానికి ఐదు రోజులూ ఆఫీసుకు వెళ్తున్నాడు. ఆ ఆఫీసులో పని చేసే మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సంస్థలోని ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు చేయించారు. అందరూ టెస్టులు చేయించుకుంటూ ఈ ఉద్యోగి కూడా వెళ్లి టెస్టు చేయించుకున్నాడు. ఇతడిలో ఎలాంటి సింప్టమ్స్ లేవట. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస కోల్పోవడం, బాడీ పెయిన్స్.. ఇలాంటి లక్షణాలు లేని తనకు కరోనా ఉండే అవకాశమే లేదనే ధైర్యంతో అతడు టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలడంతో అంతా అవాక్కయ్యారు!
అనంతపురంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు, వాళ్లిద్దరూ భార్యాభర్తలే. కరోనా సమయంలోనే వారు విధులు నిర్వర్తించారు. ఉన్నట్టుండి వాళ్లింట్లో ఆ వ్యక్తి తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్! ఆ పాజిటివ్ గా తేలిన వ్యక్తికి కరోనా కచ్చితంగా కొడుకూకోడలి నుంచినే సోకి ఉంటుందని అంచనా. అయితే వారికి టెస్టులు చేస్తే నెగిటివ్! బహుశా వారికి అప్పటికే కరోనా సోకి, దాని ప్రభావం తగ్గిపోయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటివి ఒకటని కాదు. బెంగాల్ డాక్టర్లు ఈ విషయాన్నే చెబుతున్నారిప్పుడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే కానీ, చాలా వరకూ అసింప్టమాటిక్ కేసులే అని వారు చెబుతున్నారు! తమ పరిశీలనలో తేలిన విషయాలను వారు చెబుతున్నారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికీ టెస్టులు చేసినా కొంతమందిలో పాజిటివ్ అని వచ్చిందని, వారు పెద్దగా వైద్యం అవసరం లేకుండానే మళ్లీ నెగిటివ్ అయిపోతున్నారని కోల్ కతా వైద్యులు చెబుతున్నారు.
కరోనా సోకినా ఎలాంటి సింప్టమ్స్ లేకపోవడం, సహజంగానే వారు కోలుకోవడం.. ఇవన్నీ వైరస్ ప్రభావం తగ్గుతోంది అనేందుకు కూడా రుజువులు అనే అభిప్రాయాన్ని కొంతమంది వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. మనిషిని అస్వస్థతకు గురి చేయలేకపోయిందంటే వైరస్ తన పొటెన్షియాలిటీని కోల్పోయినట్టు అవుతుందని వైద్యరంగ నిపుణులు వివరిస్తున్నారు. అయితే బహుశా ఇది కొంతమంది పై చేసిన పరిశీలనే కావొచ్చు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దాదాపు నెలన్నర కిందట ఇటలీ వైద్యులూ ఇలాంటి మాటే చెప్పారు.
మార్చి-ఏప్రిల్ నెలల్లో ఇటలీలో కరోనా విజృంభించింది. మే నెల ఆఖర్లో ఇటాలియన్ వైద్యులు స్పందిస్తూ.. కరోనా వైరస్ శక్తి క్షీణించిందని ప్రకటించారు. మార్చి-ఏప్రిల్ నెలల నాటి కరోనా వైరస్ తో పోలిస్తే, మే నెలలో మనిషిని అస్వస్థతకు గురి చేసే శక్తి దాంట్లో తగ్గిందని ఇటాలియన్ వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇటలీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతలా అంటే.. ఇప్పుడు ఇటలీ ఆల్మోస్ట్ కరోనా ఫ్రీ. మన దేశంలో కూడా కరోనా వైరస్ బలహీన పడుతోందనే అభిప్రాయాలకు ఇప్పుడిప్పుడు కాస్త ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే 80 శాతం కేసులకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశీలనలు వాస్తవమే అయితే, కోవిడ్ 19కు వ్యాక్సిన్ రాకముందే… కరోనా మాయమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.