అగ్రరాజ్యాధినేత హెచ్చరించినంత పని చేశారు. కరోనా మహమ్మారి చైనా – అమెరికా మధ్య దూరాన్ని పెంచింది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. పరస్పరం హెచ్చరించుకునే వరకు పరిస్థితులు దారి తీశాయి. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వంత పాడుతోందని అమెరికా అధ్యక్షుడు అనేక మార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌వో తన వైఖరి మార్చుకోకపోతే ఆర్థిక సాయం నిలిపి వేస్తామని కూడా హెచ్చరించారు.
అంతేకాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటామని గత మే నెలలో ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ఆచరణలో పెట్టేందుకు ట్రంప్ సన్నద్ధమయ్యారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకునే విషయమై ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ సమాచారం ఇచ్చారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి ఉపసంహరణ ప్రక్రియకు ఏడాది సమయం తీసుకోనుంది.
డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకునే విషయమై అమెరికా తమకు నోటిఫై చేసినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ కూడా నిర్ధారించారు. అలాగే తమకు కూడా లేఖ అందినట్టు ఫారిన్ రిలేషన్స్ కమిటీ డెమోక్రాట్ సేనేటర్ రాబర్ట్ మెనెన్‌డేజ్ తెలిపారు. తన హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం వల్లే డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ నిర్ణయాన్ని అధ్యక్ష రేస్‌లో ఉన్న జోసెఫ్ బైడెన్ తప్పు పట్టారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. డబ్ల్యూహెచ్‌వోతో మళ్లీ కలిసి పనిచేసే పత్రంపై సంతకం చేయనున్నట్టు ఆయన చెప్పారు.