కరోనా థర్డ్ వేవ్ గురించి వివిధ అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. మూడో వేవ్ ఉంటుందా? అసలు ఉండదా? అనే అంశంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తున్నట్టుగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుతూ ఉండటంతో.. ఇది మూడో వేవ్ సంకేతమా? అనే సందేహం తలెత్తుతూ ఉంది.
రెండో వేవ్ కూడా ముందుగా కొన్ని రాష్ట్రాలతోనే మొదలైంది. మిగతా రాష్ట్రాలు మేలుకోకపోవడంతో.. దేశమంతా కేసుల సంఖ్య పతాక స్థాయికి వెళ్లింది. ఇప్పుడు కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మూడో వేవ్ కు హాట్ స్పాట్ గా మారుతున్నాయా? అనే చర్చ మొదలైంది.
ఆ సంగతలా ఉంటే.. కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం గురించి అంచనా వేసిన ఒక పరిశోధన, ఈ ఏడాది అక్టోబర్ లో మూడో వేవ్ పతాక స్థాయికి వెళుతుందనే అంచనాలను వేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్, కాన్పూర్ ల మ్యాథమెటికల్ మోడల్ అంచనాల ప్రకారం.. కరోనా థర్డ్ వేవ్ లో వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభావం మాత్రం మరీ పతాక స్థాయిలో ఉండకపోవచ్చని ఈ అంచనా చెబుతోంది.
థర్డ్ వేవ్ లో కరోనా కనీసం రోజుకు లక్ష కేసుల వరకూ వెళ్లే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. రోజువారీ కేసుల సంఖ్య కనీసం లక్షకు, గరిష్టంగా ఈ సంఖ్య లక్షన్నర వరకూ వెళ్లవచ్చని ఈ అంచనా చెబుతోంది.
ఒకవేళ ఈ అంచనా నిజం అయితే కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉన్నట్టే. ఎందుకంటే.. సెకెండ్ వేవ్ లో ఇండియా భారీ కేసులను చూసింది. అధికారికంగానే రోజుకు నాలుగు లక్షల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రోజుకు నాలుగు లక్షల కేసులు చూసిన దేశానికి లక్ష కేసులు అయినా, లక్షన్నర కేసులు అయినా పెద్దవిగా అనిపించకపోవచ్చు. అది కూడా అక్టోబర్ నాటికి మూడో వేవ్ పతాక స్థాయికి చేరవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.
మూడో వేవ్ లో కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడానికి అవకాశం ఉందనే ఈ అంచనా ఎంతో కొంత ఊరటను ఇస్తోంది. దీనికి ప్రధాన కారణాల్లో.. ఇప్పటికే కరోనా చాలా మందికి సోకడమే అభిప్రాయమూ ఉంది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కూడా మూడో వేవ్ ప్రభావం పరిమితం కావొచ్చని అంచనా. ఇటీవల సీరమ్ సర్వే ప్రకారం.. దేశంలో దాదాపు మూడో వంతు జనాభాకు కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనగల యాంటీ బాడీస్ ఉన్నాయి. అయితే నలభై కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా ప్రమాదంలో ఉన్నారంటూ ఆ అధ్యయనం అంచనా వేసింది.
ఇక దేశంలో దాదాపు పది కోట్ల మందికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. మరో 27 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ జరిగింది. ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ అంటూ ఇది వరకూ కేంద్రం ప్రకటించినా, అలాంటిదేమీ ఇంకా జరగలేదు. ఆగస్టు ఒకటో తేదీన కేవలం 17 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే పడ్డట్టుగా కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.