ఒలింపిక్స్ హాకీలో భారత్ ది తిరుగులేని చరిత్ర. అయితే ఆ చరిత్రకు గత నలభై యేళ్లు చెదలు పట్టింది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరి సారి పతకం సాధించిన తర్వాత.. మళ్లీ పతకం విషయంలో పోటీ ఇవ్వలేకపోయింది భారత జట్టు.
భారత జాతీయ క్రీడ హాకీ. ఇండియాలో చిన్న చిన్న టౌన్లకు కూడా హాకీ నేపథ్యం ఉంటుంది. చిన్న చిన్న టౌన్లలో కూడా హాకీ స్టేడియంలుంటాయి! యూనివర్సిటీ లెవల్లో హాకీ పోటీలు జరుగుతూ ఉంటాయి. హాకీకి పెద్దగా స్థానం లేని ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే చాలా టౌన్లలో హాకీ స్టేడియంలున్నాయి. అయితే క్రమంగా అవి క్రికెట్ కు వేదికలుగా మారాయి.
అనంతపురం జిల్లా ధర్మవరంలో హాకీ స్టేడియం ఉంటుంది. అయితే అక్కడ హాకీ బ్యాట్లు కనపడవు. హాకీ ఆడేది ఏవో టోర్నీలు జరిగినప్పుడే. మామూలుగా మాత్రం అక్కడ వందల మంది యువకులు వేర్వేరు గా క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలా పేరుకు హాకీ స్టేడియం అయినా, వాటిని క్రికెట్ ఆక్రమించింది.
అయినా..హాకీకి ఆదరణ పూర్తిగా హరించుకుపోయిందనలేం. కనీసం కొన్ని రాష్ట్రాలు అయినా హాకీకి ఆటగాళ్లను అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు స్వయంగా జాతీయ హాకీ జట్టుకు స్పాన్సర్షిప్ ను అందిస్తున్నాయి. భారత హాకీ జట్టుకు ఇప్పుడు మరీ లేమి లేదు. విదేశీ కోచ్ లను, ఫిజియోలను తెచ్చుకోగలుగుతున్నారు. వీక్షకాదరణ పరిమితమే అయినా, స్పాన్సర్ల నుంచి ఎంతో కొంత సహాయసహకారాలు అందుతున్నాయి.
అయితే ఇప్పటికీ.. హాకీ పేదవాళ్ల క్రీడ. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ల నేపథ్యాన్ని గమనిస్తే ఇది స్పష్టం అవుతుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లు ఇంటర్, డిగ్రీ లెవల్ నుంచినే చదువు, కెరీర్ అంటారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారే ఇలాంటి స్పోర్ట్స్ పట్ల కాస్త ఆసక్తి చూపుతూ ఉంటారు. యూనివర్సిటీ లెవల్లో ఆడేదంతా గవర్నమెంట్ కాలేజీల పిల్లలే. ప్రస్తుతం పురుషుల, మహిళల జాతీయ హాకీ టీమ్ లను గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెద్దగా కనపడదు.
పంజాబ్ క్రమం తప్పకుండా హాకీ ప్లేయర్లను అందిస్తూ ఉంటుంది. ఇక మిగిలిన ఆటగాళ్లు కూడా చాలా మంది పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన వారు, కనీసం పూటకు జరగనివారు. ఇప్పుడు టీమిండియా మహిళల హాకీ సభ్యురాలు ఒకరి ఇంట్లో కనీసం టీవీ లేదట. తమ కూతురు టోక్యో ఒలింపిక్స్ లో ఆడుతున్నా.. ఆమె తల్లిదండ్రులు, ఇంట్లో వారు కనీసం మ్యాచ్ లను చూడటానికి టీవీ లేని పరిస్థితుల్లో ఉన్నారట. ఈ రోజుల్లో ఇంట్లో టీవీ లేని వాళ్లు ఉంటారా? అనే ప్రశ్నకు ఈ సమాధానం దొరుకుతోంది.
ఇలాంటి నేపథ్యం నుంచి వెళ్లిన వారే ఇప్పుడు భారతీయులంతా మురిసిపోయే చరిత్రను లిఖించారు. 40 యేళ్ల తర్వాత పరుషుల హాకీ టీమ్ మరోసారి పతకానికి పోటీ పడుతోంది. మహిళల హాకీ టీమ్ చరిత్రలో తొలి సారి సెమిస్ కు చేరింది. జాతీయ క్రీడ పునర్వైభవానికి ఈ విజయాలు ఎంతో కొంత దోహదం చేస్తాయి. హాకీ కూడా ఉందని భారతీయులకు తట్టి చెబుతున్నాయి ఈ విజయాలు. అయితే గెలిచినప్పుడే మనం గుర్తిస్తాం.
రేపు ఇండియన్ టీమ్ లు సెమిస్ లో ఎదుర్కొనబోయేది పటిష్టమైన జట్లను. పురుషుల హాకీ టీమ్ వరల్డ్ చాంఫియన్ బెల్జియంతో ఢీ కొట్టనుంది. లీగ్ మ్యాచ్ లలో ఐదు విజయాలను నమోదు చేసిన ఆస్ట్రేలియాను క్వార్టర్స్ లో ఓడించిన మహిళల టీమ్, మరో పటిష్టమైన జట్టుతో సెమిస్ లో తలపడనుంది. ఆ మ్యాచ్ లలో ఇండియన్ టీమ్ లు గెలిచినా, ఓడినా.. హాకీకి అయితే భారతీయుల ప్రోత్సాహం అవసరం. క్రికెట్ ఒక్కటే క్రీడ కాదు, ఐదురోజుల పాటు కన్నార్పకుండా అయినా టెస్టు మ్యాచ్ లను వీక్షించే భారతీయులు, 60 నిమిషాల హాకీని టీవీల్లో అయినా అప్పుడప్పుడు వీక్షిస్తే.. అదే బోలెడంత ప్రోత్సాహం!