కోవిడ్ మీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది!

వింతగా అనిపిస్తోంది కదా కానీ ఇది నిజం కావచ్చు. పోస్ట్ కోవిడ్, పోస్ట్ హాస్పిటలైజేషన్ కాంప్లికేషన్స్ తో టీవీ లో ఇంటర్వూ చెయ్యడం కోసం మాత్రమే కలిసిన రకరకాల స్పెషలిస్టులను గత నెలన్నరగా కలవాల్సి…

వింతగా అనిపిస్తోంది కదా కానీ ఇది నిజం కావచ్చు. పోస్ట్ కోవిడ్, పోస్ట్ హాస్పిటలైజేషన్ కాంప్లికేషన్స్ తో టీవీ లో ఇంటర్వూ చెయ్యడం కోసం మాత్రమే కలిసిన రకరకాల స్పెషలిస్టులను గత నెలన్నరగా కలవాల్సి వస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న ఒక డాక్టర్ ని కలిసాను. ఆయన ఓల్డ్ ఫ్రెండ్. చాలా ఏళ్ల  తర్వాత కలవటం. ఆయనకు నా కోవిడ్ కథ అప్పుడే తెలిసింది. ఆయన సర్జనే కానీ బోలెడు మంది కోవిడ్ పేషంట్లను ఏడాదిగా ట్రీట్ చేస్తున్నారు.

నా రకరకాల కాంప్లికేషన్సు విని అవెందుకు వస్తున్నాయో చెప్తూ “COVID will change your personality” అన్నారు. ” You mean, mentally too”అనడిగా. అవును అన్నారు. కోవిడ్ తర్వాత రకరకాల ఎమోషన్స్‌కు శరీరం రియాక్ట్ అయ్యే పద్ధ‌తి మారుతుంది. చాలా టఫ్ అనుకునే మనుషులు కూడా వీక్ అయిపోతారు అన్నారు.

అది నిజం హాస్పిటలైజేషన్ తర్వాత ఏమాత్రం బాధ కలిగే లేదా కోపం వచ్చే విషయం విన్నా, చూసినా, చివరికి చదివినా కూడా వెంటనే పల్స్ రేట్ 120-140 కి పోతుంది. గుండె పట్టేసినట్లయి సన్నగా నొప్పి కూడా వస్తుంది. దానివల్ల కార్డియాలజిస్టు దర్శనం కూడా చేసుకోవలసి వచ్చిందనుకోండి.

ఇది చాలా కామన్ కాంప్లికేషన్ అట. శరీరానికి స్ట్రెస్‌ను తట్టుకునే శక్తి తగ్గిపోతుందట. కొంతమందిలో ఎంతో కాలం ఉండే నీరసం, రకరకాల మందులు వాడటంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వీటితో వాళ్ళకూ,  ఇంట్లోవాళ్లకు వచ్చే చికాకులు, తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళలేక పోవటం, కోవిడ్ తెచ్చిన ఆర్థిక సమస్యలు, వీటితో వచ్చే నిస్సహాయత, డిప్రెషన్ ఇవన్నీ చాలా కామన్ గా తన పేషంట్లలో చూస్తున్నా అన్నారు డాక్టర్. 

ఇలాంటి సమస్యల వల్ల తన పేషంట్లలో కోవిడ్ వచ్చి తగ్గాక ఆత్మహత్య చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారట. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఆయన భయ పెట్టటం కోసం చెప్పలేదు. ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కనుక ఎరుకతో ఎదుర్కోవాలని చెప్పారు.

నేను డిశ్చార్జి అయ్యాక నా డాక్టర్ పద్మజ కూడా అవసరమైతే సైక్రియాటిస్ట్ ను కలవమని మరీ మరీ చెప్పారు. మీ లాగా యాక్టివ్ గా ఉండే వాళ్లకు మరీ కష్టం ఇదంతా అని కూడా చెప్పారు. ఇంకా డిప్రెషన్ దాకా వచ్చిందనుకోను గానీ పై సమస్యల్లో కొన్ని నేనూ ఎదుర్కుంటున్నవే. ముఖ్యంగా పనిలో పడడానికి, తిరగడానికి అవకాశం లేకపోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది నాకయితే. నాలుగు మెట్లు ఎక్కలేక చతికిలబడిన ప్రతిసారీ… వద్దులే.

మళ్ళీ మన డాక్టరు దగ్గరికొద్దాం. అవన్నీ చెప్పి “పాజిటివ్ గా ఉండండి” అన్నారు. నేను నవ్వాను. ఆయనకర్థమయింది.

“You won a war, everything else is minor” అన్నారు. కానీ కోవిడ్ మీద గెలవడం అన్నమాట మీదే నాకు నమ్మకం లేదు. పోయిన వాళ్లు ఓడిపోయి చనిపోలేదుగా. నాకు తెలిసిన బోలెడు మంది ధైర్యవంతులు కోవిడ్ తో పోయారు. బతికిన వాళ్లు సివియర్‌గా ఇన్ ఫెక్ట్ కాకపోవటం వల్లనో, అయిన వాళ్లు సరైన సమయానికి సరైన వైద్యం దొరకటం వల్లనో బతికి బయట పడ్డారనిపిస్తుంది.  ఇవన్నీ ఆలోచిస్తే సర్వైవల్ గిల్ట్  కమ్ముకొస్తుంది. ఏదో రాయాలని మొదలు పెట్టి ఏదో రాస్తున్నా. ఇక ముగిస్తా.

కాబట్టి ఎలాగోలాగా బతికి బట్ట కట్టేసిన వాళ్లు ఇలా వచ్చే రకరకాల (మెంటల్ ఇంకా ఫిజికల్) కాంప్లికేషన్లకు సిద్ధంగా ఉండండి. మొదటి వేవ్ లో వచ్చి తగ్గిన ఏడాది తర్వాత కూడా ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నవాళ్లు ఉన్నారు. అందులోనూ మొదటి 3-6 నెలలు చాలా కీలకం.

అన్నిటికన్న ముఖ్యంగా చుట్టూఉన్న వాళ్లు కాస్త కనిపెట్టుకుని ఉండండి. (ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు వ‌న‌జ.సి ఫేస్‌బుక్ నుంచి)