సెకెండ్ వేవ్ దాదాపు ముగుస్తోంది అనుకుంటున్న తరుణంలో మహారాష్ట్రలో మళ్లీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కోవిడ్ మరణాలకు సంబంధించి పాత నంబర్లను వెలికి తీస్తున్నారు.
ఇది వరకూ కోవిడ్ కారణ మరణాలుగా పరిగణించని వాటిని ఇప్పుడు గణించి కొత్త నంబర్లను విడుదల చేస్తున్నారు. దీంతో రోజువారీగా అక్కడ వెయ్యికి పైగా మరణాలు సంభవించినట్టుగా అంకెలు విడుదల చేస్తున్నారు.
గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 1200 ల స్థాయిలో నమోదు కాగా, ఇందులో 999 మరణాలు పాతలెక్కల్లోనివట. గత ఇరవైనాలుగు గంట్లలో వాస్తవ మరణాల సంఖ్య రెండు వందలకు పైగా అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇలా క్రమం తప్పకుండా పాత లెక్కలను బయటకు తీయడం వల్ల మహారాష్ట్రలో కరోనా కారణ మృతుల సంఖ్య అమాంతం పెరిగిపోతూ ఉంది. ఆ సంగతలా ఉంటే.. మరోవైపు గత రెండు రోజులుగా మహారాష్ట్రలో వరసగా పది వేలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి.
గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించి కూడా పది వేల పై సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయినట్టుగా ప్రకటించారు. గత 11 రోజుల్లో ఇదే అత్యధికం. వరసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.
కరోనా సెకెండ్ వేవ్ ప్రబలింది మహారాష్ట్ర నుంచినే. మార్చి నెలలోనే అక్కడ రికార్ధు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లోనే రోజుకు ముప్పై వేల స్థాయిలో కేసులొచ్చాయక్కడ. ఆ తర్వాత పతాక స్థాయికి వెళ్లాయి రోజువారీ కేసులు. యాక్టివ్ కేసుల లోడు ఐదు లక్షలకు పైనే నమోదయ్యింది.
ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఇక పూర్తిగా తగ్గుతాయనుకుంటున్న తరుణంలో అక్కడ కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరగడం ఆందోళనకరంగా మారుతోంది. ఈ పెరుగుదల ఏ స్థాయి వరకూ వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారుతోంది.
అయితే కరోనా బాగా విజృంభించిన ఢిల్లీ, కర్ణాటకల్లో మాత్రం రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖంలోనే కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య రెండు మూడు వందల స్థాయికి తగ్గింది.