పిటిష‌న‌ర్‌కు హైకోర్టు చుర‌క‌లు

భూముల ఆక్ర‌మ‌ణ‌పై విచార‌ణ‌కు ఏర్పాటు చేసిన క‌మిటీపై అభ్యంత‌రం చెబుతూ హైకోర్టుకెళ్లిన పిటిష‌న‌ర్‌కు న్యాయ‌స్థానం చుర‌క‌లు అంటించింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఈట‌ల భూఆక్ర‌మ‌ణ వ్య‌వ‌హారం అనేక…

భూముల ఆక్ర‌మ‌ణ‌పై విచార‌ణ‌కు ఏర్పాటు చేసిన క‌మిటీపై అభ్యంత‌రం చెబుతూ హైకోర్టుకెళ్లిన పిటిష‌న‌ర్‌కు న్యాయ‌స్థానం చుర‌క‌లు అంటించింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఈట‌ల భూఆక్ర‌మ‌ణ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో దేవ‌రాయాంజ‌ల్ ఆల‌య భూములు పెద్ద ఎత్తున ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ ఆక్ర‌మ‌ణ‌ల నిగ్గు తేల్చేందుకు దేవ‌రాయాంజ‌ల్ ఆల‌య భూముల స‌ర్వేకు ప్ర‌భుత్వం ఐఏఎస్ అధికారుల‌తో కూడిన‌ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు కేసీఆర్ స‌ర్కార్ 1014 జీవోను జారీ చేసింది. ఈ జీవో చెల్ల‌ద‌ని, నిలిపివేయాల‌ని స‌దాకేశ‌వ‌రెడ్డి అనే వ్య‌క్తి తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. ఈ పిటిష‌న్‌పై గురువారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్‌పై హైకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌భుత్వ‌, ఆల‌య భూముల‌ను గుర్తించ‌కూడ‌దా? క‌బ్జాదారుల‌ను ఆక్ర‌మ‌ణ‌లు చేసుకునేందుకు అనుమ‌తించాలా? అని పిటిష‌న‌ర్‌కు హైకోర్టు చుర‌క‌లు అంటించింది. 

విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వ‌డం క‌మిటీ బాధ్య‌త అని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. అయితే పిటిష‌న‌ర్ల‌కు నోటీసులు ఇచ్చి భూముల్లోకి దిగాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దేవరాయాంజల్‌ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 

పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది. కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.