జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు కోసం టీడీపీతో పాటు సీపీఐ వెంపర్లాడుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాటలు తెలియజేస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయమై గతంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పవన్‌కల్యాణ్ సరిగ్గా ఐదు నిమిషాలు కుదురుగా నిలబడితే, అప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీవాళ్లతో అన్నట్టు నారాయణ పేర్కొన్నారు. పవన్‌కు స్థిరత్వం లేదని, ఒక చోటు కుదురుగా నిలబడే మనస్తత్వం లేదని ఘాటు వ్యాఖ్యలు చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది.
కానీ బీజేపీ నుంచి పవన్ వేరు పడతారని, ఆయనతో పొత్తు పెట్టుకోవాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో బీజేపీతో జనసేన పార్టీ తెగతెంపులు చేసుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో లౌకిక పార్టీలన్నీ ఏకమై వైసీపీ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తాయన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందని పవన్‌కల్యాణ్ అనుకోవడం అతని అమాయకత్వం అని రామకృష్ణ అన్నారు.
లౌకిక పార్టీలన్నీ ఏకమై వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాయని రామకృష్ణ మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో జనం లేరు. రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కొన్నేళ్లు కలిసి ఉండడం, ఆ తర్వాత విడిపోవడం చూస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన, పొత్తు కోసం వెంపర్లాడుతున్న టీడీపీ…. సీపీఐ నాయకుడి దృష్టిలో లౌకిక పార్టీలు.
బీజేపీతో ఏనాడూ పొత్తులో లేని వైసీపీ మాత్రం సీపీఐ దృష్టిలో అంటరాని పార్టీ. ఏపీ సీపీఐ నాయకుడు లౌకకత్వానికి వింత నిర్వచనం ఇస్తున్నారు. టీడీపీ, జనసేనతో అనైతిక పొత్తు కోసం వెంపర్లాడుతున్న వీరిని చూసి జనం ఎంత సిగ్గులేదయ్యా అని విమర్శిస్తున్నారు.