తెలుగుదేశం పార్టీ విషయంలో ఇతర విపక్షాలకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మధ్యనే ఒక చానల్ ఇంటర్వ్యూలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు తమతో ఉండాలని కోరుతున్నా ఆయన అయోమయంలో ఉన్నారని సెటైర్లు వేశారు. అంటే బీజేపీతో బాబు దోస్తీకి చూస్తున్నారు అని సీపీఐ నారాయణ అర్ధం వచ్చేలా మాట్లాడారు.
ఇక ఏపీ సీపీఎం నేతలు అయితే ఇప్పటిదాకా టీడీపీతో కలసి నడచింది ఎక్కడా లేదు. వారి అజెండా వేరుగా ఉంటూ వస్తోంది. అయితే ఈ మధ్య జగన్ మాట్లాడుతూ కామ్రేడ్స్ ది బయట ఎర్ర జెండా, వెనక పచ్చ అజెండా అని హాట్ కామెంట్స్ చేసారు.
దీని మీద సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మధు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో జత కట్టామనడం తప్పు అని ఖండించారు. తాము సొంతంగానే ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తున్నామని చెప్పారు. అవి తమ మీద వేస్తున్న నిందలుగా పేర్కొంటూ వైసీపీ పెద్దలు అలాంటి ఆలోచనలు మానుకోవాలని కోరడం విశేషం.
ఇక తాము టీడీపీ టైమ్ లో కూడా అంగన్ వాడీస్, కాంట్రాక్టర్ల సమస్యల మీద పోరాడిన సంగతిని గుర్తు చేశారు. ఇక జగన్ తీరు చూస్తే ఆయన టీడీపీ బాటలోనే పాలన సాగిస్తున్నట్లుగా ఉందని మధు కామెంట్స్ చేయడం విశేషం. మరో వైపు ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీ మీద పోరాటానికి వైసీపీ సిద్ధం కావాలని మధు పిలుపు ఇవ్వడమూ విశేషం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణణను అడ్డుకోవడమే కాకుండా, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఉద్యమించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి మధు చేసిన కామెంట్స్ చూస్తే తమను టీడీపీలో కలిపేశారన్న బాధ అయితే ఆయనలో చాలా ఎక్కువగానే ఉంది అని అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ పెద్దలు కూడా అందరినీ ఏర్చి కూర్చి చంద్రబాబు జట్టులో పెట్టడం కంటే వారిని తమ దారికి తెచ్చుకునే వ్యూహాలేంటో చూస్తే బెటరెమో.