సినిమా ఇండస్ట్రీ నుంచి సీఎం జగన్ ను కలవడానికి వచ్చినవారిలో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలే ఎక్కువ. కానీ జగన్ మాత్రం చిన్న సినిమా గురించి ఆలోచించారు. చిన్న సినిమాలను బతికించుకోవాలని, వారికి కూడా లాభాలు వస్తేనే ఇండస్ట్రీలో సమతుల్యత ఉంటుందని సూచించారు.
కేవలం హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ తోనే భారీ సినిమాలు ఉండవని, టెక్నాలజీ పరంగా కూడా భారీ సినిమాలు తీసేవారిని కూడా గుర్తించి, అలాంటివాటికి కూడా భారీ సినిమాల సరసన చోటు కల్పిస్తామని చెప్పారు జగన్.
రోజుకి ఐదు షోలు.. ఓటీటీలతో పోటీ..
ఓటీటీ వ్యవహారాన్ని కూడా సీఎం జగన్, చిరంజీవి బృందంతో చర్చించారు. ఓటీటీకి పోటీగా సినిమా నిలబడాలంటే ఏంచేయాలని ఆరా తీశారు. రోజుకి 5 షోలు వేసుకునే వెసులుబాటు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఐదు షోలు వేస్తే మల్టీప్లెక్సుల్లో మరింత సందడి పెరుగుతుందని, తొలి వారం రోజులపాటు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ప్రేక్షకులకు భారం కాకుండా, ఇండస్ట్రీ వారికి నష్టం లేకుండా టికెట్ రేట్లు నిర్ణయిస్తామన్నారు.
చలో విశాఖ..
ఇప్పుడు కాకపోయినా, ఇంకొన్నాళ్లకు విశాఖ పెద్ద సిటీ అవుతుంది, సినిమా ఇండస్ట్రీ కూడా విశాఖకు తరలి వస్తే అది మరింత వేగవంతమవుతుందని అన్నారు సీఎం జగన్. విశాఖలో అందరికీ స్థలాలు ఇస్తామని, స్టూడియోలు ఇతర వ్యవహారాలు అక్కడినుంచే నడిచేలా చూస్తామని చెప్పారు.
తెలుగు సినిమాలకు ఏపీ నుంచి 60శాతం ఆదాయం వస్తుంటే, తెలంగాణలో 35 నుంచి 40శాతం ఆదాయం వస్తోందని.. ఇకపై ప్రతి తెలుగు సినిమాకు సంబంధించి కనీసం 20శాతం చిత్రీకరణ ఏపీలో జరిగేలా నిబంధన విధించబోతున్నట్టు హింట్ ఇచ్చారు.
పెద్ద సినిమాలకే కాదు.. అందరికీ పండగే..
ముఖ్యంగా పండగ కలెక్షన్లను పెద్ద సినిమాలు క్యాష్ చేసుకునేందుకు ఆరాటపడుతుంటాయని, ఇకపై పెద్ద సినిమాలతోపాటు, చిన్న సినిమాలకు కూడా ఆ అవకాశం ఇద్దామన్నారు జగన్.
సమతుల్యత అవసరం అని, దానికి సినీ పరిశ్రమ నుంచే కార్యాచరణ ఉండాలని కోరారు. వాళ్లూ పరిశ్రమలో భాగమే కదా అని అన్నారు. మొత్తమ్మీద చిన్న సినిమాలను బతికించేందుకు సీఎం జగన్ పెద్ద కార్యాచరణే సిద్ధం చేశారు