ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు.
అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.