ఆక్సిజన్ కావాలా: కరోనా వేళ సరికొత్త మోసం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. దీన్ని ఆసరాగా చేసుకొని సరికొత్త మోసం తెరపైకొచ్చింది. కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ సిలిండర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ రేట్లకు ఆక్సిజన్…

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. దీన్ని ఆసరాగా చేసుకొని సరికొత్త మోసం తెరపైకొచ్చింది. కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ సిలిండర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ రేట్లకు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పిస్తామని కొందరు.. గాలి నుంచి లిక్విడ్ ఆక్సిజన్ ను తయారుచేసే కాన్సంట్రేటర్లు ఇప్పిస్తామని మరికొందరు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఆన్ లైన్ మోసాలు 2 చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్ కు చెందిన ఆనంద్ శర్మ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మెషీన్ ను కొనాలనుకున్నాడు. కరెంట్ తో పనిచేసే ఈ మెషీన్.. మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను సేకరించి మనకు అందిస్తుంది. లోకల్ మార్కెట్లో ఇది దొరక్కపోవడంతో ఇంటర్నెట్ ను ఆశ్రయించాడు. నరీన ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పేరుతో ఫోన్ నంబర్ దొరికింది.

వాళ్లతో మాట్లాడితే మెషీన్ పంపిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా కొంత డబ్బు చెల్లిస్తే తప్ప ఈ కరోనా టైమ్ లో మెషీన్ పంపించడం కుదరదన్నారు. పైగా డిమాండ్ చాలా ఎక్కువ ఉందని నమ్మించారు. దీంతో ఆనంద్ శర్మ, వాళ్లు చెప్పిన ఎకౌంట్ కు 2 లక్షల 73 వేల రూపాయలు బదిలీ చేశాడు. అంతే.. ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ అయింది.

ఇలాంటిదే మరో ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. దాదాపు ఇలాంటి మెషీన్ నే కొనాలని ప్రయత్నించిన మరో వ్యక్తి ఇండియామార్ట్ వెబ్ సైట్ చూసి ఫోన్ చేశాడు. 52వేల 700 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పడంతో.. 2 కావాలని కోరాడు. ఆ మేరకు లక్ష రూపాయలకు పైగా మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. కట్ చేస్తే, ఆ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది.

ఇలా ఒకేసారి నగరంలో 2 సైబర్ మోసాలు నమోదవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కరోనా నివారణ ఉత్పత్తులు, ఆక్సిజన్ కాన్సంట్రేషన్లు అంటూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఇలాంటిదే ఓ సందేశం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. 

ఆక్సిజన్ కావాల్సిన వాళ్లు కేవలం వెయ్యి రూపాయలు కడితే చాలని, చెప్పిన ఇంటికి లేదా హాస్పిటల్ కు సిలిండర్ పంపిస్తామని చెబుతున్నారు. డబ్బు చెల్లించిన వెంటనే ఆ నంబర్ ను బ్లాకులో పెట్టేస్తున్నారు.