తిరుపతిలో బీజేపీ అసలు టార్గెట్ ఇదే!

“రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం మేమే. జగన్ కు మెజారిటీ తగ్గితే అది మా వల్లే. ఏపీలో బీజేపీ-జనసేన బలం పుంజుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో మేమే నంబర్-2గా నిలబడతాం” ఇలా పైకి చాలా కబుర్లు…

“రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం మేమే. జగన్ కు మెజారిటీ తగ్గితే అది మా వల్లే. ఏపీలో బీజేపీ-జనసేన బలం పుంజుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో మేమే నంబర్-2గా నిలబడతాం” ఇలా పైకి చాలా కబుర్లు చెప్పింది భారతీయ జనతా పార్టీ.

కానీ ఆ పార్టీకి అంత సీన్ లేదనే విషయం కమలనాధులతో పాటు సాధారణ ప్రజలకు కూడా తెలుసు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ఆర్భాటం చేయడం వెనక అసలు కారణం ఇంకోటి ఉంది. ఆ పార్టీకి అర్జెంట్ గా ఓట్ల సంఖ్య పెరగాలి. ఆ విషయాన్ని అధినాయకత్వం దగ్గర డప్పు కొట్టుకోవాలి. ఇదీ అసలు లెక్క.

2019లో లెక్కలు ఓసారి చూద్దాం. తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ కు జరిగిన పార్లమెంట్ ఎన్నికలో వైసీపీకి ఏకంగా 55.03 శాతం ఓట్లు పడ్డాయి. అఖండ మెజారిటీ దక్కింది. 37.65శాతం ఓట్లతో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైంది. ఎంత ఘోరంగా అంటే.. బీజేపీకి పడిన ఓట్ల కంటే నోటా కింద పోలైన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.

2019 ఎన్నికల్లో నోటాకు 25,781 ఓట్లు పోలవ్వగా.. భారతీయ జనతా పార్టీకి 16,125 మాత్రమే వచ్చాయి. అందుకే ఉప ఎన్నికలో తన టార్గెట్ ను లక్ష ఓట్లుగా పెట్టుకుంది కమలం పార్టీ. బై-పోల్ లో బీజేపీకి లక్ష ఓట్లు వస్తే కనుక ఆ పార్టీకి అదే పెద్ద విజయం. కేవలం ఆ అంశాన్ని పట్టుకొని ఏపీలో పబ్బం గడుపుకోవాలని చూస్తోంది ఆ పార్టీ.

ఇదే అంశంపై జనసేన కూడా గురిపెట్టుకొని కాచుక్కూర్చుంది. బీజేపీకి ఓట్లు పెరిగితే, అది తమ చలవే అని చెప్పుకోవడానికి ఆ పార్టీ ఏమాత్రం సిగ్గుపడదు. జనసేన మద్దతుతో గత ఎన్నికల్లో బరిలోకి నిలిచిన బీఎస్పీకి కూడా నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఆ విషయాన్ని మరుగుపరచాలంటే, బీజేపీకి ఓట్ల సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటోంది జనసేన పార్టీ. పైగా ఈసారి బీజేపీకి ఓట్లు పెరగకపోతే, అది ఆ పార్టీ వైఫల్యం కిందకు రాదు, పవన్ కల్యాణ్ చేతకానితనం కిందకు వస్తుంది.

నిజంగా బీజేపీ తను అనుకున్న లక్ష ఓట్ల టార్గెట్ అందుకుంటే.. ఏపీలో రాజకీయాలు మరింత వేగంగా మారే అవకాశం ఉంది. జనసేన-బీజేపీ మైత్రీ బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటివరకు తెరవెనక ఉన్న లుకలుకలు, బేధాభిప్రాయాలన్నీ పక్కకెళ్లిపోతాయి. మరోవైపు టీడీపీ కూడా ఇంకాస్త గట్టిగా బీజేపీ వెంట పడే ఛాన్స్ ఉంది. 2024 పొత్తుల కోసం ఇప్పట్నుంచి బీజేపీని ప్రసన్నం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది టీడీపీ.

అయితే లక్ష ఓట్ల టార్గెట్ అనేది ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు. టీడీపీకే ఈసారి లక్ష ఓట్లు కష్టమేమో అన్నట్టుంది పరిస్థితి. మరీ ముఖ్యంగా తిరుపతి కేంద్రంగానే ప్రత్యేక హోదాపై ప్రమాణాలు చేసి, మాట తప్పి, నిలువునా మోసం చేసి, ఇప్పుడు అదే ప్రాంతంలో ఉప ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీకి మరోసారి ఘోర పరాభవం తప్పకపోవచ్చు. దీనికితోడు ఈసారి జగన్ వేవ్ కూడా తోడవ్వడం కమలనాధులకు మరో పెద్ద తలనొప్పి. కాబట్టి.. గతంలో వచ్చిన ఆ 16వేల పైచిలుకు ఓట్లను కాపాడుకుంటే బీజేపీకి అదే పది వేలు.