కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి రోజుకు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ఊరటను ఇచ్చే మాట చెప్పింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.
కనీసం తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కోట్ల మంది ఎదురుచూపుల్లో ఉన్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు కూడా తీవ్రమవుతున్నాయి. సామాన్య ప్రజలు ఈ విషయంలో డైరెక్టుగా ప్రధాన మంత్రి మోడీపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు వ్యాక్సిన్ అందించడంలో మోడీ పూర్తిగా విఫలం అయ్యాడనే భావన సామాన్య ప్రజల్లో గట్టిగా నెలకొని ఉంది.
ఈ క్రమంలో ఆగస్టు నాటికి దేశ డిమాండ్ కు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా కావొచ్చని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. దేశంలో కనీసం రోజుకు కోటి వ్యాక్సిన్ డోసేజ్ ల అవసరం ఉంది. అయితే ఆ మేరకు సరఫరా మాత్రం లేదు. రోజుకు 20 లక్షల స్థాయిలోనే ఇప్పటికీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
దేశానికి కనీసం రెండు వందల కోట్ల డోసేజ్ లు అవసరం అని అంచనా. ఈ తీరున ఇరవై లక్షల డోసులు లెక్కబెడుతూ పోతే.. కరోనా ముందు ముందు కూడా విలయాలను సృష్టించవచ్చు అనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. రోజుకు కనీసం కోటి డోసులు వ్యాక్సిన్ ను వేయగలిగితే.. ఈ ఏడాది చివరకు దేశంలోని 18 యేళ్ల పై వయసు వారందరికీ వ్యాక్సిన్ అందించవచ్చని అంచనా.
అయితే ఆ టార్గెట్ ను ఇప్పుడప్పుడే అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వమే అందుకోసం ఆగస్టు వరకూ వేచి చూడాలని అంటోంది. ఇంకా రెండు నెలల తర్వాత కానీ రోజుకు కోటి వ్యాక్సిన్ డోసేజ్ ల స్థాయిని అందుకోలేమని అంటోంది. మరి అప్పటికైనా ఆ మేరకు వ్యాక్సినేషన్ చేయగలిగితే.. మంచిదే.
ఈ ఏడాది చివరాఖరుకు రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సిన్ అని ఇది వరకే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మరి ఇంకా రెండు నెలల పాటు.. రోజు వారీ లక్ష్యానికి తగిన రీతిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేకపోతే.. రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని ఏ మేరకు రీచ్ అవుతారో!