“అమరావతే ముద్దు….మూడు రాజధానులే వద్దు” అంటూ మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గత అనుభవాల దృష్ట్యా అభివృద్ధిలో అసమానతల కారణంగా వేర్పాటు ఉద్యమాలకు అవకాశం ఇవ్వకూడదనే సదాశయంతో సీఎం వైఎస్ జగన్ ఓ అడుగు ముందుకేశాడు.
సీమ, ఉత్తరాంధ్రలలో అభివృద్ధి ,పరిపాలన వికేంద్రీకరించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూల్‌లో న్యాయ, అమరావతిలో శాసనపరమైన రాజధానుల ఏర్పాటుకు మూడు రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. ఆ బిల్లులకు శాసనమండలిలో టీడీపీ అడ్డుతగిలింది. దీంతో సీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
శాసనమండలిలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ సీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. బుధవారం రాత్రి నుంచే నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖ నగరంలో పలు ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున మానవహారాలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటి వద్ద బుధవారం రాత్రి, గురువారం ఆందోళనలు చేశారు. కాకినాడ, నర్సాపురంలో , తణుకు, అత్తిలి తదితర ప్రాంతాల్లో మోటార్ బైక్ ర్యాలీలు, మానవహారాలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు యథేచ్ఛగా సాగాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు.
రాయలసీమ విషయానికి వస్తే ఉద్యమం రాజుకుంటోంది. కర్నూల్‌లో టీడీపీ కార్యాలయాన్ని లాయర్లు ముట్టడించారు. చంద్రబాబు ఫ్లెక్సీని చించేశారు. అలాగే చెప్పులతో కొట్టి నిరసన ప్రకటించారు. నంద్యాలలో ఎమ్మెల్సీ ఫరూక్ ఇంటిని ముట్టడించారు. ఇంకా జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆదోని తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు, అనంతపురం జిల్లా హిందూపురం తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మేధావులు సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు ప్రణాళిక రచించారు.
మున్ముందు ఈ ఉద్యమం తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూల్‌లో హైకోర్టు పెట్టడాన్ని బీజేపీ, వామపక్షాలు ఆహ్వానిస్తున్నాయి. కానీ చంద్రబాబు నోట కనీసం ఆ మాట రాకపోవడంపై సీమవాసులు మండిపోతున్నారు. సీమ వాసిగా చెప్పుకునే చంద్రబాబు కర్నూల్‌లో హైకోర్టు పెట్టడాన్ని ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజధానిలో భూములు కాపాడుకోవడానికి మాత్రమే అమరావతిపై టీడీపీ పట్టుదలగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా శాసనమండలిలో టీడీపీ అడ్డగింత వెనుక బడిన ప్రాంతాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబుపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు భవిష్యత్‌లో తీవ్రమై బాబు రాజకీయ జీవితాన్ని నివురుగప్పిన నిప్పు దహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.