హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నప్పట్నుంచి కష్టపడి పెంచిన తల్లిని కూతురు పొట్టన పెట్టుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తల్లిని హత్య చేసింది. తనకు ఏమీ తెలియనట్టు పోలీసుల ఎదుట డ్రామా ఆడింది. కానీ అడ్డంగా దొరికిపోయింది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగింది ఈ ఘటన. రాజేంద్రనగర్ లో ఉంటున్న మేరీ క్రిస్టియన్, చిన్నప్పట్నుంచి కూతురు రుమాను ప్రేమగా పెంచింది. అయితే రూమాకు ఈమె అసలు తల్లి కాదు, పెంపుడు తల్లి మాత్రమే. స్థానికంగా ఉన్న మారిక స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తోంది మేరీ.
కొన్నాళ్లుగా మేరీ-రూమా మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి కారణం రూమా ప్రేమలో పడ్డమే. కూతురు ప్రేమ విషయం తెలిసి మేరీ మందలించింది. దీంతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది రూమా. ఇద్దరూ కలిసి ఆమె మృతదేహాన్ని హిమాయత్ సాగర్ లో పడేశారు.
అక్కడితో ఆగకుండా తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది రూమా. అయితే ఆమె ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. పైగా స్థానికులు ఇచ్చిన సమాచారం కూడా రూమాకు వ్యతిరేకంగా ఉంది. దీంతో తమదైన శైలిలో విచారించగా, తల్లిని హత్య చేసినట్టు అంగీకరించింది రూమా.
ఆమె ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంగా హిమాయత్ సాగర్ నుంచి మేరీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టంకు పంపించారు పోలీసులు. రూమాను, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు.