“నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న స్ఫూర్తితో మేము కూడా అదే పని చేయాలనుకుంటున్నాం. అయితే మా సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌కు 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ లోపు సీఎం నుంచి సానుకూల స్పందన రాక పోతే ఇద్దరు కూతుళ్లు, భార్యతో పాటు నా శవాన్ని జగన్‌కు బహుమతిగా పంపుతాం. దయచేసి మా ఆవేదన సీఎంకు చేరే వరకూ మా వీడియో షేర్ చేయండి. నలుగురి ప్రాణాలను కాపాడండయ్యా” అని అక్బర్ బాషా అనే వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌లో కన్నీరుమున్నీరవుతూ హెచ్చరించారు. జగన్ సర్కార్‌ను ఆ లైవ్ వీడియో ఆందోళనకు గురి చేసింది. ముస్లిం మైనార్టీ కుటుంబ హెచ్చరిక ఫలించింది. వెంటనే సీఎం జగన్ స్పందించారు. కడప ఎస్పీతో మాట్లాడి బాధితుడికి వారంలో న్యాయం చేయాలని ఆదేశించారు.
కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఎర్రబల్లెకు చెందిన అక్బర్‌బాషా మొదటి నుంచి వైసీపీ కార్యకర్త. ఆయన కుటుంబానికి వైఎస్సార్ అంటే విపరీతమైన అభిమానం. అక్బర్‌బాషా భార్యకు తల్లిదండ్రుల వైపు నుంచి 1.5 ఎకరాల భూమి దక్కింది. దీన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు తిరుపాల్‌రెడ్డి ఆక్రమించారని అక్బర్ బాషా కుటుంబం ఆరోపిస్తోంది. భూమి తమదే నని చెప్పేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా అక్బర్ బాషా కుటుంబం చూపుతోంది. ఈ నేపథ్యంలో పదేళ్లుగా తిరుపాల్‌రెడ్డితో భూమి విషయమై వివాదం నడుస్తోంది. శుక్రవారం దువ్వూరు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చంపుతామని హెచ్చరించారని అక్బర్ బాషా కన్నీటిపర్యంతమయ్యారు.
ముఖ్యంగా మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి నిన్న సాయంత్రం వరకూ మీ వైపే న్యాయం ఉందని చెప్పారని, ఆ తర్వాత ఒక్కసారిగా ఎలా మారిందని అక్బర్ బాషాతో పాటు ఆయన భార్య ప్రశ్నిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇక న్యాయం జరగదనే నిర్ణయానికి వచ్చిన అక్బర్ బాషా …నిన్న రాత్రి భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫేస్‌బుక్ లైవ్‌లో కన్నీటిపర్యంతమవుతూ గోడు వెల్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి తనను, తన భార్యతో పాటు అండగా వచ్చిన వాళ్లను మాటల్లో చెప్పలేని విధంగా తిట్టారని వాపోయారు. బూటు కాల్‌తో తంతానని, మరోసారి కనిపిస్తే ఎన్‌కౌంటర్ చేస్తానని సీఐ హెచ్చరించినట్టు వాపోయారు. తనను స్టేషన్‌లో కూచోపెట్టి, తిరుపాల్‌రెడ్డితో వరినాట్లు వేయించినట్టు ఆరోపించారు. వాళ్లకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని అక్బర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మైదుకూరు రూరల్ సీఐతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అక్బర్‌బాషా కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
న్యాయం చేయాల్సిన పోలీసులు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేస్తుంటే దిక్కు లేని వాడిగా మిగిలిపోయానని తీవ్ర ఆవేదన చెందారు. తాను కూడా వైసీపీ కార్యకర్తనే అని అక్బర్‌బాషా చెప్పడం గమనార్హం. ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో ఒక్కసారి జగన్ చూడాలని ఆయన వేడుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేయకపోతే చావే గతి అని ఆయన హెచ్చరించారు. తనకు న్యాయం చేయాలని సీఎం జగన్‌తో పాటు డీజీపీ గౌతమ్‌సవాంగ్, ఐజీ వెంకట్రామిరెడ్డిలను వేడుకున్నారు.
అక్బర్‌బాషా ఫేస్‌బుక్ లైవ్‌లో గోడు వెల్లబోసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించారు. తన సొంత జిల్లాలో, పార్టీకి అండగా నిలిచే మైనార్టీ కుటుంబం, అందులోనూ తన బంధువుల వల్ల ఇబ్బంది పడడంపై జగన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు.
అలాగే మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్ మీడియాతో మాట్లాడుతూ అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించామన్నారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసు కున్నట్లు వివరించారు. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్ పిటిషన్ ఇచ్చారని తెలిపారు. ‘‘సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించినట్టు ఎస్పీ వెల్లడించారు. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించినట్టు పేర్కొన్నారు.