రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, యువహీరో సాయిధరమ్ తేజ్ గాయాలుపాలై కోలుకుంటున్నాడు. ప్రమాదం నేపథ్యంలో “మా” అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బైక్ రేస్‌కు వెళ్లొద్దని పలుమార్లు సాయిధరమ్ తేజ్‌ను హెచ్చరించినట్టు ఆయన చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ప్రమాదం నేపథ్యంలో ఆయన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నరేశ్ తెలిపారు. తన కుమారుడు నవీన్ విజయ కృష్ణకు సాయితేజ్ మంచి స్నేహితుడన్నారు. ఇద్దరూ అన్నద మ్ముల్లా ఉంటారన్నారు. సాయిధరమ్ తేజ్ తన బిడ్డలాంటివాడన్నారు.
నిన్న సాయంత్రం బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు వెళ్లిపోయారన్నారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకున్నట్టు నరేశ్ తెలిపారు. కానీ కుదరలేదన్నారు. పెళ్లి-కెరీర్‌తో జీవితంలో సెటిల్ కావాల్సిన వయసు ఇది అన్నారు.
ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిదని ఆయన హితవు చెప్పారు. సినీ నటులు కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బైక్ రేస్‌కు వెళ్లి కుటుంబ సభ్యులకు, నిర్మాతలకు ఆవేదన కలిగించొద్దని ఆయన సూచించారు.
గతంలో తాను కూడా బైక్ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైనట్టు చెప్పారు. తన తల్లి ఒట్టు వేయించుకోవడంతో నాటి నుంచి బైక్స్ జోలికి వెళ్లలేదన్నారు. ఆస్పత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని అనుకున్నప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదన్నారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో అతన్ని కలుస్తానన్నారు.