తగ్గుతున్న మెజారిటీ కథేంటో!

తను ప్రచారానికి వెళ్లకపోయినా కుప్పం ప్రజలు మరోసారి తనను గెలిపించారని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు! అక్కడి అదేదో తిరుగులేని ఘనత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి నేతలు చాలామందే…

తను ప్రచారానికి వెళ్లకపోయినా కుప్పం ప్రజలు మరోసారి తనను గెలిపించారని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు! అక్కడి అదేదో తిరుగులేని ఘనత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి నేతలు చాలామందే ఉన్నారు. వాళ్లెవ్వరూ ఇలా డబ్బా కొట్టుకోలేదు. చంద్రబాబు మాత్రం అది తనకే సాధ్యం అన్నట్టుగా డబ్బా కొట్టుకున్నారు.

అయినా ఇలాంటి ప్రచార ఆర్భాటాలు చంద్రబాబుకు కొత్తవి ఏమీకావు. ఆ సంగతలా ఉంటే.. కుప్పంలో ప్రతి ఎన్నికలకూ చంద్రబాబు నాయుడుకు వచ్చే మెజారిటీ తగ్గిపోతూ ఉన్న వైనం గురించి ఆయన మాట్లాడలేదు. 2004 నుంచి ప్రతిసారీ చంద్రబాబు నాయుడుకు కుప్పంలో మెజారిటీ తగ్గుతూ వస్తోంది.

ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీచేయగా యాభై తొమ్మిది వేల స్థాయి మెజారిటీ వచ్చింది. ఆ తర్వాతి ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ నలభై ఆరు వేలకు పడిపోయింది. 2014లో మాత్రం నలభై ఏడు వేల మెజారిటీ వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీలో భారీ పతనం చోటు చేసుకుంది. ఆయన మెజారిటీ ముప్పైవేల చిల్లరకు వచ్చింది.

చంద్రబాబుకు ధీటుగా సరైన అభ్యర్థి లేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం ప్రచారం కూడా చేసుకోలేక ఆసుపత్రి పాలైనా చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ ముప్పైవేలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గట్టిగా పోరాడి ఉంటే.. విజయం సాధ్యమే అనే నమ్మకంతో పనిచేసి ఉంటే..  కుప్పంలో ఫలితం ఎలా ఉండేదో కానీ.. ఇక నుంచి చంద్రబాబు నాయుడు కుప్పానికైనా సరిగా పని చేసుకుంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా నిలవొచ్చు.

అలాకాదు.. కుప్పం ప్రజలు బానిసలు అనుకుంటే.. చిత్తూరు జిల్లాలో చేజారిన మిగతా అన్ని నియోజకవర్గాల కథను గుర్తుచేయాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు! కుప్పానికి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు… భారీగా తగ్గిపోయిన మెజారిటీని కూడా దృష్టిలో ఉంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి