ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టడానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఎదురు చూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మత సంబంధ విషయాల్లో జనాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి పవన్‌కల్యాణ్ కాచుకుని ఉంటారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఏదైనా జగన్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుందంటే చాలు …విమర్శించడానికి పవన్ పెద్దగా ఆలోచిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు.
తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన 208 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం ద్వారా అమ్మేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేనాని వెంటనే ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వానికి హితవు చెబుతూ ఓ ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ….
“మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూములు బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయశాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే ఉండాలి. వాటిని సంరక్షించాలే తప్ప అమ్ముకోడానికి వీల్లేదు.
ధర్మ పరిరక్షణకు కట్టుబడిన దేవాదాయ, ధర్మాదాయశాఖ పాలకుల ఒత్తిడికి తలొగ్గడం వల్లే వేలం, విక్రయ ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను అమ్మకానికి పెడితే భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది” అని పవన్ హెచ్చరించారు.
ఇక్కడే ముఖ్యమంత్రి జగన్‌పై పవన్ అక్కసు కనిపిస్తోంది. అసలు మంత్రాలయ భూములను విక్రయించాలని ఎవరి హయాంలో నిర్ణయం జరిగిందో కనీస పరిజ్ఞానం లేకుండా పవన్ మాట్లాడ్డంపై విమర్శలు వస్తున్నాయి.
మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠానికి 208 ఎకరాల భూములున్నాయి. భూములను కబ్జా కాకుండా కాపాడుకోవడం కష్టంగా ఉండడంతో , వాటిని అమ్మి డిపాజిట్ చేస్తే బాగుంటుందని మఠం అధికారుల నుంచి 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వెళ్లింది.
ఈ మొత్తం భూముల ద్వారా మఠానికి వస్తున్న ఆదాయం కేవలం రూ.3లక్షలే అని తెలిపారు. అదే భూములు అమ్మితే రూ.10 కోట్లు దక్కుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, దానిపై ఏడాదికి రూ.53 లక్షల వడ్డీ వస్తుందని అప్పట్లో మఠం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో భూముల అమ్మకానికి చంద్రబాబు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.
మఠం భూములను అమ్మేందుకు ప్రభుత్వం 2018, జనవరిలో అనుమతిచ్చింది. అప్పుడు దేవాదాయశాఖ మంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు. అంటే ప్రస్తుతం జనసేనాని మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యే అన్నమాట.
అంతేకాదు, అప్పట్లో బీజేపీ-టీడీపీ కూటమికి జనసేనాని మద్దతు ప్రకటించడంతో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నేడు అమలు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమైతే మతం కోణంలో విమర్శలు చేయడం పవన్‌కు గౌరవం తెస్తుందా?
ఇదేనా పవన్ పాటించే మతసామరస్యం? ఎవరి హయాంలో నిర్ణయం తీసుకున్నారో తెలియకుండానే జగన్ సర్కార్‌పై నిందలు వేయడం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్ మతపరమైన సున్నిత అంశాల గురించి మాట్లాడేటప్పడు కాస్తా ముందూ వెనుకా ఆలోచిస్తే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.