టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కరోనా పూర్తిగా కట్టడి చేసింది. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే ఆయన గజగజ వణికిపోతున్నారు. వయసు పైబడిన నేపథ్యంలో, వైద్యుల సూచన మేరకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బాబు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు.
రోగం వచ్చిన తర్వాత ఆందోళన చెందే కంటే, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైన పని. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు వస్తారా? రారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించేందుకు నేడు ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జూమ్ మీటింగ్లకు పరిమితమైన చంద్రబాబు , అసెంబ్లీ సమావేశాలకు ఆ అవకాశం లేకపోవడంతో ఏం చేస్తారో అనే చర్చ నడుస్తోంది.
ముఖ్యంగా శాసనసభ, మండలి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనాసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు.
భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో అపార నష్టం, రైతులకు కోలుకోలేని దెబ్బ, పన్నుల పెంపు తదితర 20 అంశాలపై చర్చించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీనిపై చంద్రబాబు ఏం మాట్లాడకపోవడం గమనార్హం. అందుకే అసెంబ్లీ సమావేశాలకు బాబు రాకపై టీడీపీ నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.