రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్ పొడిగింపు సందర్భంగా బాంబే హైకోర్టుపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తాజా కామెంట్స్‌పై దేశ వ్యాప్తంగా పౌర సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
“ఎఫ్ఐఆర్‌లోని ప్రాథమిక విషయాలను హైకోర్టు పట్టించుకోలేదు. తద్వారా స్వేచ్ఛను రక్షించాల్సిన బాధ్యత నుంచి, రాజ్యాంగ విధుల నుంచి కోర్టు తప్పుకుంది” అని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం తప్పు పట్టింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరులో బాంబే హైకోర్టు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
ఆర్కిటెక్ట్ – ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఈ నెల 4న అర్నబ్‌తో పాటు మరో ఇద్దరిని రాయగడ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసి, తనకు వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అర్నబ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అర్నబ్ కోరుకున్నట్టుగా బెయిల్ మంజూరుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో న్యాయం కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపులను అర్నబ్ తట్టారు. ఈ నెల 11న అర్నబ్‌తో పాటు మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ….ఒక్కరోజు స్వేచ్ఛ కోల్పోయినా అది తీవ్రనష్టమే అని కీలక వ్యాఖ్యలు చేసింది.
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ విషయంలో న్యాయస్థానాలు ముందు వరుసలో నిలబడాలని ఆకాంక్షించింది. పౌరులను వేధించే ఆయుధాలుగా క్రిమినల్ చట్టాలు మారకుండా చూడాలని, ఆ బాధ్యత న్యాయ వ్యవస్థపైనే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
అర్నబ్ కేసుపై విచారణలో భాగంగా గతంలో కూడా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని గుర్తు పెట్టుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా స్వేచ్ఛను రక్షించాల్సిన బాధ్యత నుంచి, రాజ్యాంగ విధుల నుంచి కోర్టు తప్పుకుందని అర్నబ్‌కు బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. హైకోర్టుకు అక్షింతలు వేయడం న్యాయ వర్గాలతో పాటు ఇతర వర్గాల్లో కూడా చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు.