దీపావళి పర్యావరణ హితం కాదు. గ్రీన్ దీపావళి చేసుకోవాలి. దీపావళి బాణా సంచా కాల్చకూడదు. కేవలం దీపాలు మాత్రమే వెలిగించాలి. గత కొన్నేళ్లుగా ఈ వాదన వినిపిస్తూ వుంది.
హిందువుల పండగ, మనకే ముందుగా చులకన కాబట్టి కోర్టు కేసులు పడుతూ వున్నాయి. ప్రతిసారీ వివాదం చెలరేగుతూనే వుంది. అయితే అసలు దీపావళి ఎందుకు అవసరం అన్నది చూద్దాం.
హిందువుల ప్రతి పండుగకు ఓ లాజిక్ వుంది. దాని వెనుక సైన్స్ వుంది. అయితే మన పెద్దలు ప్రతీదీ దేవుడికి ముడిపెట్టేసి, లాజిక్ లను వెనక్కు నెట్టేసారు. దాంతో ఇన్ని శతాబ్దాల తరువాత కొత్త కొత్త వాదనలు పుట్టుకు వస్తున్నాయి. సరే ఆ లాజిక్ ఏమిటో చూద్దాం.
దీపావళి పండుగ సరిగ్గా వానలు ముగిసి, చలి ప్రారంభమయ్యే టైమ్ లో వస్తుంది. పంట చేలల్లో, కాలవల్లో నీళ్లు నిండుగా వుండే సమయం. పైగా ఇప్పటి మాదిరిగా గతంలో మూడు నెలల పంటలు లేవు. ఆరునెలల పంటలు వుండేవి. పంట సరిగ్గా సగంలో వుండగా ఈ దీపావళి వచ్చేది.
దీపావళికి ముఖ్యమైనవి మతాబులు, చించుబుడ్లు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గంథకం మండి వచ్చే పొగ కీలకం. ఈ పొగ క్రిమి సంహారిణిగా పని చేస్తుంది. గంథకం వాసనకు పాములు ఇళ్లలోకి రావు.
పంట చేలను ఆశించే చీడపీడలకు ఈ మతాబులు కాల్చడం వల్ల వచ్చే పొగ మందుగా పని చేస్తుంది. నీళ్లు నిలవ వుండి, దోమలు పెరుగుతూ వుంటాయి. అలాంటి టైమ్ లో ఇంటి చుట్టూ మతాబులు కాల్చడం వల్ల ప్రయోజనం వుంటుంది.
అలాగే పూర్వం విద్యుత్ దీపాలు వుండేవి కావు. ఆ టైమ్ లో వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారేటపుడు వేగం సూర్యాస్తమయం అవుతుంది. త్వరగా చీకట్లు అలుముకుంటాయి. అందువల్ల ఆ టైమ్ లో కాస్త ఎక్కువ దీపాలు పెడితే ఊరంతా కాంతిగా వుంటుంది.
ఇలాంటి అవసరాల కోసం పుట్టిన పండగు దీపావళి. కానీ రాను రాను కాంతులు, పొగ పోయి, శబ్దాడంబరం ఎక్కువయింది. దాంతో మొదటికే మోసం వస్తోంది.
ఆకాశదీపం ఎందుకు?
అలాగే దీపావళి మర్నాటి నుంచి ఆలయాల్లో, కొంతమంది ఇంటి ఆవరణలో ఆకాశదీపాలు పెడతారు. అంటే పొడగాటి కర్ర పాతి దాని చివర్న సాయంత్రం వేళ దీపం వెలిగిస్తారు. దీనికి లాజిక్ కు అందని రకరకాల కారణాలు చెబుతారు. కానీ అసలు కారణం వేరు. దాని వెనుక కూడా సైన్స్ నే వుంది.
శీతవేళ ప్రారంభమైనపుడు విపరీతంగా పసిరిక పురుగులు, దోమలు పెరుగుతాయి. ఇంటి ఆవరణలో, ముఖ్యంగా గేట్ కు దగ్గరగా ఎత్తుగా ఈ ఆకాశ దీపం పెడితే, ఇంట్లోకి వచ్చే పురుగులు అన్నీ అక్కడే ఆగిపోతాయి. పురుగులను దీపం ఆకర్షిస్తుందన్న సంగతి తెలిసిందే కదా. అందుకోసం పుట్టుకు వచ్చిన ఆచారం ఈ ఆకాశ దీపం.