రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన వరలక్ష్మి హత్య కేసుపై షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రేమించిన అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అఖిల్.. తను ఎందుకు వరలక్ష్మిని చంపాల్సి వచ్చిందో వెల్లడించాడు.
కేవలం తనకు బ్రేకప్ చెప్పిందనే కారణంతో పాటు, మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉంటుందనే కోపంతో వరలక్ష్మిని హత్య చేసినట్టు పోలీసులకు తెలిపాడు అఖిల్.
ఈ సందర్భంగా కేసును కొలిక్కి తీసుకొచ్చే కొన్ని కీలక విషయాల్ని బయటపెట్టాడు అఖిల్. సాక్ష్యాధారాల్ని తారుమారు చేసేందుకు తనే కారం పొడి ప్యాకెట్ కొనుక్కొని తీసుకెళ్లినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఘటనా స్థలం వద్ద దొరికిన నల్లటి వస్త్రం వరలక్ష్మిదేననే విషయాన్ని బయటపెట్టాడు.
మరోవైపు పోలీసులు పెద్ద మిస్టరీగా మారిన క్షుద్రపూజల ఆనవాళ్లుపై కూడా అఖిల్ స్పందించాడు. తను, వరలక్ష్మి ఆ ప్రదేశంలో కలుసుకున్న సమయానికే ఎవరో అక్కడ క్షుద్రపూజలు చేశారని.. వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. నల్లటి వస్త్రానికి, క్షుద్రపూజలకు సంబంధం లేదని, ఆ వస్త్రం వరలక్ష్మిదేనని తెలిపాడు.
ఈ కేసును విశాఖ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. టెక్నికల్ గా, భౌతికంగా అన్ని రకాల సాక్ష్యాధారాల్ని సేకరించి పక్కాగా కేసు ఫైల్ చేశారు.
ఈ కేసుపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి, ఘటన జరిగిన 24 గంటల్లోనే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు కేసు పురోగతిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రి సుచరిత ఈ కేసును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఎట్టిపరిస్థితుల్లో నిందితుడు, చట్టంలోని లొసుగుల ఆధారంగా తప్పించుకునే వీల్లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు కూడా బదిలీ చేశారు.