దేశ రాజధాని కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడానికే కష్టపడుతూ ఉంది. గాలి కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల యాక్టివిటీస్ ను వీలైనంతగా తగ్గించుకోవడం మినహా పరిస్థితిని ఎంతో కొంత సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వాహానాల ప్రయాణాలను ఆపేసే తరహాలో లాక్ డౌన్ విధించడానికి అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
గాలి కాలుష్యాన్ని కాస్త తగ్గించడానికి అనుగుణంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశం గురించి ఆలోచనలు సాగుతున్నాయని, లాక్ డౌన్ ప్రకటిస్తే..సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనే అంశం గురించి కేజ్రీవాల్ ప్రభుత్వం సమాలోచనల్లో ఉందట.
ఇప్పటికే ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వారం రోజుల పాటు పాఠశాలలు మూతే. ఈ వారం రోజులూ ఆన్ లైన్ లో క్లాసులు చెప్పుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి భారీ ఎత్తున వాహనాలు తిరగాల్సి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే కనీసం స్కూలు బస్సులు, పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లే కార్లు, బైకులు రోడ్ల మీదకు రాకుండా ఉంటాయి. దీని వల్ల ఎంతో కొంత కాలుష్యం తగ్గుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఈ మేరకు స్కూళ్లను కనీసం వారం రోజుల పాటు ఆన్ లైన్ బోధనకు మార్చారు.
అలాగే.. కన్ స్ట్రక్చర్ వర్క్స్ ను కూడా ప్రభుత్వం మూడు రోజుల పాటు నిషేధించింది. ఇళ్ల నిర్మాణ పనుల వల్ల దుమ్మూధూళీ రేగి, గాలిలోకి కలవడం కూడా కాలుష్యానికి ఒక కారణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు రోజులు ఈ పనులన్నింటిని ఆపేయించి.. కాలుష్య తీవ్రతను కాస్త తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది!
శీతాకాలం వస్తే ఢిల్లీలో కాలుష్య తీవ్రత పతాక స్థాయికి చేరడం మామూలుగా మారింది. ఈ సారి నవంబర్ లోనే ఈ తీవ్రత ప్రమాదకరమైన స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వం పై చర్యలు చేపట్టింది. ఇలా రోజుల లెక్కలు వేసుకుని కాలుష్య తీవ్రతను తగ్గించుకోవాల్సిన పరిస్థితి రావడం అక్కడి తీవ్రతను తెలియజేస్తూ ఉంది. మరి కొన్నేళ్లు ఇదే పరిస్థితి కొనసాగిస్తే.. ఢిల్లీ ఏ మేరకు నివాస యోగ్యం? అనే ప్రశ్న ఇప్పటికే తలెత్తినట్టే.