తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. టెస్టులు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా, మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, తను హోం ఐసొలేషన్ లో ఉన్నట్టుగా కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కూడా కరోనా ఇబ్బంది తప్పుతున్నట్టుగా లేదు. రెండో వేవ్ లో కూడా ముందుగా కేసుల సంఖ్య బాగా పెరిగిన ప్రాంతాల్లో ఢిల్లీ ఉంది. ఇప్పుడు మూడో వేవ్ లో కూడా ఢిల్లీనే ముందు వరసలో ఉండటం గమనార్హం.
ఇక కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ నేతలు ఈ సారి కూడా ఈ వైరస్ విషయంలో బాధితులుగా, స్ప్రెడర్లుగా మారే అవకాశాలున్నట్టున్నాయి.
కరోనా వ్యాప్తి మూడో వేవ్ లో వ్యాపిస్తున్నా.. ఇంకా రాజకీయ ర్యాలీలు, కార్యక్రమాలు ఆగడం లేదు. యూపీ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. ఎన్నికలు ఆగవన్నట్టుగా సీఈసీ ఇప్పటికే ప్రకటించింది.
కరోనాతో ఏవైనా ఆగొచ్చు కానీ, ఎన్నికలు ఆగవని ఇప్పటికే పలు దఫాలుగా క్లారిటీ ఇచ్చారు. రెండో వేవ్ కు కాస్త ముందు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు యథాతథంగా జరుగుతాయన్న సీఈసీ ప్రకటన నేఫథ్యంలో.. ఈ ఎన్నికల్లో తలపడే పార్టీలు, నేతలు సమావేశాలు, ర్యాలీలను కొనసాగిస్తున్నారు.
కరోనా భారీ ఎత్తున వ్యాపించే అవకాశం ఉన్నా ఎవ్వరూ తగ్గడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తేడా లేకుండా.. అంతా అధికారమే టార్గెట్ గా ఎన్నికలే టార్గెట్ గా జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రభావం కేసుల సంఖ్య పెరగడం పై పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.