టీనేజర్స్ కు వాక్సిన్.. పేరెంట్స్ కు జాగ్రత్తలు

ప్రస్తుతం 15-18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. లక్షల మంది వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. టీకా వేయించుకున్న తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే…

ప్రస్తుతం 15-18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. లక్షల మంది వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. టీకా వేయించుకున్న తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేస్తున్నారు వైద్య నిపుణులు.

ఇప్పటివరకు కరోనా వాక్సిన్ తీసుకున్న కోట్ల మందిని పరిశీలించిన వైద్య నిపుణులు.. వాళ్లలో అత్యంత తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవని గుర్తించారు. కాబట్టి టీనేజర్లకు కూడా దాదాపు దుష్ప్రభావాలు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కొందరు టీనేజర్లకు మాత్రం స్వల్ప స్థాయిలో జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండొచ్చని.. ఇది సహజమని అంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఆందోళన చెందకుండా పారాసిటమాల్ ఇస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

ఒకవేళ చర్మవ్యాధులు, రియాక్షన్స్ ఉన్నట్టు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మాత్రం తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సినేషన్ కు ముందే కేంద్రంలో వైద్య సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పడం మంచి పద్ధతి.

గతంలోలా ఇప్పుడు కూడా అబ్జర్వేషన్ పీరియడ్ 15 నిమిషాలు ఉంది. అంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత టీనేజర్లను 15 నిమిషాల పాటు అక్కడ కూర్చోబెట్టి గమనిస్తారన్నమాట. 15-18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని నిర్ణయించారు. ఈ టైమ్ లో వాళ్లతో పాటు తల్లి లేదా తండ్రి కూడా ఉంటే బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత టీనేజర్లకు 2 రోజుల పాటు జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. శరీరంలో రోగ నిరోధక శక్తిని మరింత పెంచే ఆహార పదార్థాల్ని ఇవ్వడంతో పాటు.. మంచి నీళ్లను ఎక్కువగా తాగించాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 రోజుల పాటు కూల్ డ్రింక్స్ కు కూడా దూరంగా ఉంటే మంచిదంటున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న వేళ.. తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలా వద్దా అనే సందేహాల్ని పెట్టుకోవద్దంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు వైద్య నిపుణులు. రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ.. అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్ ను తీసుకోవడమే ఉత్తమమని చెబుతున్నారు.