దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండడంతో ఆప్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కఠిన ఆంక్షలు విధించేందుకు నిర్ణయించింది. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పును అరికట్టేందుకు ఇదొక్కటే మార్గమనే అభిప్రాయానికి కేజ్రీవాల్ సర్కాఱ్ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా బారిన పడడం గమనార్హం. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు ట్విటర్ వేదికగా ఆయన ప్రకటించారు.
ఇదిలా వుండగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గత మూడు రోజుల్లో ఒక్క ఢిల్లీలోనే 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం…మహమ్మారి వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. సోమవారం ఒక్కరోజే 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే వైరస్ వ్యాప్తికి ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కట్టడి కాకపోవడంతో మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేసేందుకు కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ ఈ వీకెండ్స్ నుంచి కర్ఫ్యూను అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రతి శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరిందన్నారు. గతేడాది మే తర్వాత పాజిటివిటీ రేటు ఈ స్థాయికి పెరగడం మళ్లీ ఇప్పుడే అని ఆయన అన్నారు.
దీంతో కరోనా పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం సమావేశమైంది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 5శాతం దాటడంతో ఢిల్లీలో ‘రెడ్ అలర్ట్’ ఆంక్షలు విధించేందుకు నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే అధికారులు కర్ఫ్యూ విధించాలని సిఫార్సు చేయడం, దాన్ని ఆమోదించినట్టు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. వీటితో పాటు మరికొన్ని నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం, అలాగే ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాల్స్, సెలూన్స్ వంటి అత్యవసరం కాని దుకాణాలు మూసి వేయనున్నారు. అలాగే ప్రజా రవాణాపై ఆంక్షలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇదిలా వుండగా జనవరి 15 నాటికి ఢిల్లీలో రోజువారీ కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్.. రెండు వేరియంట్లు కారణమని వారు చెప్పారు.