తెగించిన నిమ్మ‌గ‌డ్డ‌…సంచ‌ల‌న పిటిష‌న్‌

త్వ‌ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ తెగించిన‌ట్టే క‌నిపిస్తున్నారు. ఈ సారి ఆయ‌న ఏకంగా రాజ్‌భ‌వ‌న్‌నే టార్గెట్ చేశారు. తాజాగా హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ దాఖ‌లు చేసిన పిటిష‌న్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.…

త్వ‌ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ తెగించిన‌ట్టే క‌నిపిస్తున్నారు. ఈ సారి ఆయ‌న ఏకంగా రాజ్‌భ‌వ‌న్‌నే టార్గెట్ చేశారు. తాజాగా హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ దాఖ‌లు చేసిన పిటిష‌న్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చిస్తున్న , అలాగే ఆయ‌నకు రాస్తున్న లేఖ‌ల‌న్నీ లీక‌వుతున్నాయ‌ని, దీనిపై సీబీఐ ద‌ర్యాప్తునకు ఆదేశించాల‌ని కోరుతూ నిమ్మ‌గ‌డ్డ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయడం క‌ల‌క‌లం రేపుతోంది.

పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు సాఫీగా సాగ‌డం, ఈ నెలాఖ‌రులో నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండడంతో ….ఇంత కాలం ప్ర‌భుత్వం, ఎస్ఈసీ మ‌ధ్య వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేన‌ని అంద‌రూ భావించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌క్కుల‌కు భంగం క‌లిగించార‌ని, వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్రివిలేజ్ క‌మిటీ ఎస్ఈసీకి నోటీసులు పంప‌డంతో వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. 

విచార‌ణ‌కు రావాల‌ని ప్రివిలేజ్ క‌మిటీ కోర‌డంపై నిమ్మ‌గ‌డ్డ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అస‌లు త‌న‌కు నోటీసులు ఇచ్చే అధికార‌మే ప్రివిలేజ్ క‌మిటీకి లేద‌ని నిమ్మ‌గ‌డ్డ స‌రికొత్త వాద‌న‌కు తెర‌లేపారు. ఇదే సంద‌ర్భంలో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ స‌రికొత్త లాజిక్‌ను తెర‌పైకి తీసుకొచ్చి న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. 

తాను గ‌వ‌ర్న‌ర్‌కు రాసిన లేఖ‌లు లీక్ కావ‌డం వ‌ల్లే అన‌వ‌స‌ర న్యూసెన్స్ క్రియేట్ అవుతోంద‌ని నిమ్మ‌గ‌డ్డ భావిస్తున్నారు. ఎందుక‌కంటే గ‌వ‌ర్నర్‌కు రాసిన లేఖ‌లో త‌మ‌ను అవ‌మాన‌ప‌రిచేలా వ్యాఖ్యానించార‌నేది మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఫిర్యాదు. ఒక‌వేళ అది నిజ‌మే అనుకున్నా …గ‌వ‌ర్న‌ర్‌కు రాసిన కాన్ఫిడెన్సియ‌ల్ లేఖ‌లు ఎలా లీక్ అవుతున్నాయ‌నేది నిమ్మ‌గ‌డ్డ ప్ర‌శ్న‌.

ఈ విష‌య‌మై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని నిమ్మ‌గ‌డ్డ కోర్టుకెక్క‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఈ పిటిష‌న్‌లో నిమ్మ‌గ‌డ్డ ఏమ‌న్నారంటే …

తాను గవర్నర్‌కు రాస్తున్న లెటర్స్‌ అన్ని పబ్లిక్‌ లెటర్స్‌ కాదని, ప్రివిలేజ్‌ లెటర్స్‌ అని, అలాంటప్పుడు అవి గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలా బయటకు వస్తున్నాయో నిగ్గు తేల్చేందుకు విచారణ జరపించాలని నిమ్మ‌గ‌డ్డ కోరారు. అలాగే తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని, తాను గవర్నర్‌కు రాసిన లెటర్స్‌ సోషల్‌ మీడియాలో చూశామని మంత్రులు అంటున్నారని, అది ఎలా సాధ్యమో విచారించాలని ఆయ‌న కోరారు.

ఈ పిటిష‌న్‌లో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీఎస్‌, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను  ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తానికి ఎస్ఈసీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం… చివ‌రికి గ‌వ‌ర్న‌ర్‌ను లాగిన‌ట్టైంది. ఇది ఏ మలుపు తీసుకుంటుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది.