పెళ్లే కాని ప్ర‌ముఖ న‌టికి టీనేజ్ కూతురు

పెళ్లి, స‌హ‌జీవ‌నం లాంటి ఊసే లేని ఓ ప్ర‌ముఖ న‌టి అక‌స్మాత్తుగా త‌న కూతురంటూ ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది. ఇంత‌కూ ఆ ప్ర‌ముఖ న‌టి మ‌రెవ‌రూ కాదు……

పెళ్లి, స‌హ‌జీవ‌నం లాంటి ఊసే లేని ఓ ప్ర‌ముఖ న‌టి అక‌స్మాత్తుగా త‌న కూతురంటూ ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది. ఇంత‌కూ ఆ ప్ర‌ముఖ న‌టి మ‌రెవ‌రూ కాదు… ష‌కీలా. ఈ పేరు వింటే కుర్ర‌కారు గుండె ల‌య త‌ప్పుతుంది. ఇది నిన్న‌టి మాట‌. ఇప్పుడామె ఇండ‌స్ట్రీలో అంత బిజీగా లేరు. కానీ ఆమె పేరు మాత్రం నిత్యం మీడియాలో నానుతూ ఉంటుంది.

త‌న‌ను అర్థం చేసుకునే వాడు దొర‌క్క‌పోవ‌డంతో ష‌కీలా అవివాహిత‌గానే మిగిలిపోయారు. ఇటీవ‌ల ఆమె త‌మిళ బుల్లితెర‌పై త‌ళుక్కుమ‌ని మెరుస్తున్నారు. ‘కుకు విత్ కోమ‌లి’లో కంటెస్టెంట్‌గా  ష‌కీలా అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా కూడా  నిలిచే అవకాశాలున్నాయ‌ని స‌మాచారం.

ఈ షోలో భాగంగా ష‌కీలా ప్రేక్ష‌కుల‌కు షాక్ ఇచ్చారు. ఓ యువ‌తిని తెర‌పైకి తీసుకొచ్చి త‌న కుమార్తెగా ప‌రిచ‌యం చేయ‌డంతో కంటెస్టెంట్ల‌తో పాటు ప్రేక్ష‌కులు తామేం వింటున్నామో, చూస్తున్నామో అర్థంకాని స్థితిలోకి వెళ్లారు. ఎందుకంటే అస‌లే పెళ్లే కాని ష‌కీలాకు టీనేజ్ వ‌య‌సులో ఉన్న కూతురు ఎక్క‌డి నుంచే వ‌చ్చింద‌నే ప్ర‌శ్న‌లు మ‌న‌సుల‌ను అల్ల‌క‌ల్లోలం చేశాయి. 

యువ‌తి పేరు మిల్లా అని, అయితే త‌న సొంత బిడ్డ కాద‌ని, చాలా ఏళ్ల క్రితం ద‌త్త‌త తీసుకున్న‌ట్టు చెప్పుకొచ్చారామె. షాకింగ్‌ల‌కు ప‌ర్యాయ ప‌ద‌మైన ష‌కీలా …ప‌నిలో ప‌నిగా ఇదే వేదిక‌పై మ‌రో షాక్ కూడా ఇచ్చారు. మిల్లా ట్రాన్స్‌జెండ‌ర్ అని బాంబు పేల్చారు.  మిల్లాను బాల్యంలోనే ద‌త్త‌త తీసుకున్నాన‌ని భావోద్వేగంతో చెప్పారు. 

క‌ష్ట కాలంలో త‌న‌కు చాలా స‌పోర్ట్‌గా నిలిచింద‌ని , తాను కూడా అంతే స‌పోర్ట్ ఇచ్చిన‌ట్టు ష‌కీలా వెల్ల‌డించారు. తానంటే మిల్లాకు అమిత‌మైన ప్రేమ అని ష‌కీలా ఆనందంతో చెప్పుకొచ్చారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా మిల్లా బిజీగా ఉన్నారు. మోడ‌ల్‌గా త‌న అదృష్టాన్ని ఆమె ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్నారు.