ఈ ప్రశ్నకు జవాబు ఉందా ?

మరాఠా రిజర్వేషన్ కోటాపై సాగుతున్న ఓ కేసులో సుప్రీం కోర్టు ప్రభుత్వాలను ఒకే ఒక ప్రశ్న సూటిగా అడిగింది. దేశంలో రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు కొనసాగుతాయి ? ఆ కేసేమిటో, దాని కథ…

మరాఠా రిజర్వేషన్ కోటాపై సాగుతున్న ఓ కేసులో సుప్రీం కోర్టు ప్రభుత్వాలను ఒకే ఒక ప్రశ్న సూటిగా అడిగింది. దేశంలో రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు కొనసాగుతాయి ? ఆ కేసేమిటో, దాని కథ ఏమిటో ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. సుప్రీం కోర్టు అడిగిన ఈ సూటి ప్రశ్న గురించి ఆలోచించాలి. 

ఈ ప్రశ్నకు పాలకులుగానీ, నాయకులు గానీ ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. రిజర్వేషన్లు ఇంకా కొనసాగాల్సిందే అంటే అగ్రవర్ణాలవారు ఆగ్రహిస్తారు. అక్కరలేదంటే బడుగు బలహీన వర్గాలవారు తోలు తీసి ఆరేస్తారు. 

రాజకీయాలతో సంబంధం లేనివారు దీనికి ఒకటే జవాబు చెప్పొచ్చు. ఈ దేశంలో ఓట్ల రాజకీయాలు ఉన్నంతవరకు, కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు, పార్టీలు ఉన్నంతవరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్ళపాటు మాత్రమే అమలు చేయాలని చెప్పారు. 

ఈ పదేళ్లలో దళితులు, వెనుకబడిన కులాల వారు అభివృద్ధి చెందుతారని ఆయన ఆశించారు. కానీ రిజర్వేషన్లను ఆసరాగా చేసుకొని ఓట్ల రాజకీయాలకు అలవాటుపడిన మన నాయకులు రిజర్వేషన్లను కొనసాగిస్తూపోయారు. పదేళ్లు అన్నచోట మరో పదేళ్లు కొనసాగించవచ్చు.

కానీ డెబ్భై ఏళ్ళు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే దేశం అభివృద్ధి చెందినట్టా? చెందనట్టా? వెనుకబడిన కులాల్లో ఏ ఒక్క కులమూ ఇప్పటివరకు అభ్యున్నతి సాధించలేదా ? అన్న ప్రశ్నకు పాలకులు సరైన సమాధానం చెప్పగలరా ? రిజర్వేషన్ల లక్ష్యం వెనకబడిన అన్ని కులాలను అభివృద్ధి చేయడం. కానీ వెనుకబడిన కులాల్లో ఎన్ని అభివృద్ధి చెందాయి. 

వెనుకబడిన కులాలవారు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనేదే రిజర్వేషన్ల లక్ష్యం అయినప్పుడు అలా అభివృద్ధి చెందిన కులాలను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగిస్తున్నారా?  వెనుకబడిన కులాల్లో కోటీశ్వరులు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉన్నారు. ఉన్నత విద్యలు అభ్యసించి సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నవారూ ఇంకా రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు.

ఏ సామాజిక వర్గం జనాభా ఎక్కువ ఉన్నదో ఆ సామాజిక వర్గానికే రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారు. ఇందుకు కారణం వారు ఓటు బ్యాంకుగా ఉపయోగపడతారు కాబట్టి. సమాజంలో అగ్రవర్ణాలుగా ముద్ర వేయించుకున్న కొన్ని సామాజిక వర్గాలు రిజర్వేషన్లు లేని కారణంగా ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలవరకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటే సరేలే అనుకోవచ్చు. కానీ ప్రమోషన్లలో సైతం రిజర్వేషన్లు ఉన్నాయి. అకడమిక్ పరీక్షల్లో సైతం రిజర్వుడ్ కేటగిరీ వారికి మార్కులు తక్కువ వస్తే చాలు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేటప్పుడు వయసులో సైతం వారికి  రిలాక్జేషన్ ఉంది.

రిజర్వేషన్లకు హేతుబద్ధత లేదు కాబట్టే రిజర్వుడ్ కేటగిరీలో వారికి టాలెంట్ ఉండదనే ప్రచారం సాగుతోంది. కానీ టాలెంట్ అనేది కులాన్నిబట్టి రాదు. కులాన్నిబట్టి సమర్ధత, తెలివితేటలుంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత అయ్యేవాడు కాదు కదా. రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాదు … పేదరికం ప్రాతిపదికన ఉండాలని అనేకమంది మొత్తుకుంటున్నారు. కానీ కులాలను నమ్ముకొని కదా మన నాయకులు బతుకుతున్నారు. 

పొద్దున్నే లేస్తే సమసమాజం రావాలి, కుల రహిత సమాజం కావాలి అని నాయకులు ఉపన్యాసాలు దంచుతుంటారు. కానీ ఆచరణ ఈ రకంగా ఉన్నప్పుడు సమసమాజం ఎన్నటికీ రాదు. దేశం అభివృద్ధి చెందిందని చెప్పినా, రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పినా సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందినట్లే కదా. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఇంకా అవసరమా? 

ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ రంగాన్ని పెనుభూతం మాదిరిగా చూపడానికి కారణం ఆ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కాబట్టి. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్ ను పారిశ్రామికవేత్తలు ఎప్పుడో తిరస్కరించారు. రిజర్వేషన్లు అమలు చేయాలని ఒత్తిడి చేస్తే పరిశ్రమలు మూసేస్తాంగానీ రిజర్వేషన్లు అమలు చేయబోమన్నారు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే … పరిశ్రమలకు వివిధ రకాలుగా ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి కాబట్టి. భూములిస్తోంది. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అనేక రకాలైన పన్ను రాయితీలు ఇస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందుతున్నప్పుడు ప్రభుత్వ విధానమైన రిజర్వేషన్లు అమలు చేయాలి కదా అని అడుగుతున్నారు కొందరు. కాలానుగుణంగా విధానాలు మారాలి. కానీ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగిస్తున్నారు.