హైకోర్టు చీవాట్లు పెట్టినా తెలంగాణ సర్కార్ తీరు మారలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్న అంబులెన్స్‌లను రాష్ట్ర సరిహద్దులో తెలంగాణ పోలీసులు మళ్లీ అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఐఆర్ఎస్ మాజీ అధికారి గరిమళ్ల వెంకటకృష్ణారావు తాజాగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
నాలుగు రోజుల క్రితం ఇదే రీతిలో సరిహద్దుల్లో అంబులెన్స్‌ల అడ్డగింతపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను అడ్డుకునే హక్కు మీకెక్కడదని హైకోర్టు నిలదీసింది.
ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే చూపాలని ప్రభుత్వ తరపు న్యాయవాదైన ఏజీని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్ మెడికల్ హబ్ అని, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు తేల్చి చెప్పింది.
దీంతో హైకోర్టు ఆదేశాలతో ఒకట్రెండు రోజులు అంబులెన్స్‌లకు అనుమతి ఇచ్చింది. అయితే గత రాత్రి నుంచి తిరిగి అంబులెన్స్‌ల అడ్డగింత ప్రారంభమైంది. గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అంబులెన్స్ లను అడ్డుకుంటున్నారు.
అంబులెన్స్‌లను అడ్డుకోవడం మానవత్వమేనా? అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేసిన హెచ్చరికలు బేఖాతరయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తాజాగా తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.