తెలంగాణలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినపడుతోంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన సహజ ధోరణిలో పట్టించుకోనట్టే ఉన్నారు.
పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం అందించడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్లు కేటాయించడం, ఉచితంగా వైద్యం చేయిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంపై క్రమక్రమంగా ఒత్తిడి పెరిగింది. దీంతో కేటీఆర్ ఆరోగ్యశ్రీ విషయంపై ఆలోచిస్తామని తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటున్నారు.
కార్పొరేట్ దోపిడీ గురించి, పేద, మధ్యతరగతి ప్రజల కష్టాల గురించి తనకు సమాచారం ఉందని, కేసీఆర్ తో చర్చించి ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదే జరిగితే అది ఏపీ సీఎం జగన్ ఎఫెక్ట్ అని చెప్పక తప్పదు. ఏపీలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం వల్లే తెలంగాణ ప్రభుత్వపై ఒత్తిడి పెరిగింది, చివరకు ఒప్పుకోక తప్పేలా లేదు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం కాస్ట్ లీగా మారిపోవడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీలో ఆరోగ్యశ్రీ పేదలకు అండగా నిలిచింది. లక్షల బిల్లులతో జేబులకు చిల్లులు పడకుండా ఆపింది.
కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్సకు రేట్లు నిర్ణయించి ఒకరకంగా, పేద, మధ్యతరగతి ప్రజలు కరోనాతో అప్పులపాలు కాకుండా చేసింది ఏపీ ప్రభుత్వం. తన నిర్ణయాలతో కేవలం ఏపీ వాసులకే కాదు, తెలంగాణ వాసులకి కూడా అండగా నిలబడుతున్నారు జగన్. ఏపీ ఫార్ములాని తెలంగాణలో కూడా అమలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు.
అంతే కాదు. కరోనా వ్యాక్సిన్ కి గ్లోబల్ టెండర్లు పిలిచే విషయంలో, కర్ఫ్యూ విషయంలోనూ ఏపీ ప్రభావం తెలంగాణపై పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ లోనే కొవాక్సిన్ తయారవుతోంది, అయినా కూడా తెలంగాణని వ్యాక్సిన్ కొరత పట్టిపీడిస్తోంది. ఈ దశలో గ్లోబల్ టెండర్లకు వెళ్లడం నామోషీగా భావించిన సీఎం కేసీఆర్, ఆ ప్రతిపాదన పక్కనపెట్టారు.
ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లతో ముందుకు వచ్చిందో అనివార్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సి వచ్చింది. ఇక కర్ఫ్యూ విషయం సరే సరి. ఏపీలో కఠిన ఆంక్షలు అమలవుతున్నా, తెలంగాణ ఆ విషయంలో మీనమేషాలు లెక్కించింది.
చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తే.. అసలు దాని వల్ల కేసులు తగ్గుతాయా అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. చివరకు కోర్టు ఆగ్రహంతో ఏపీ కంటే రెండు గంటలు ఎక్కువగా కర్ఫ్యూని అమలు చేస్తున్నారు.
మొత్తమ్మీద.. కరోనా సెకండ్ వేవ్ ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం జగన్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం తెలంగాణపై బలంగా పడుతుందనే విషయం అర్థమవుతోంది.