తనపై బదిలీ వేటును ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముందే పసిగట్టారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. తనపై వేటను అడ్డుకునేందుకు గౌతమ్ సవాంగ్ చివరి వరకూ ప్రయత్నాలు కొనసాగించారనే చర్చ జరుగుతోంది. అయితే అవేవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోపం ముందు పనిచేయలేదని ఉన్నతాధికారవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నెల 3న ఉద్యోగుల చలో విజయవాడ విజయవంతం, అనంతరం సీఎం జగన్‌కు తనకు క్లాస్ తీసుకోవడంతో జరగరానిదేదో జరగబోతోందనే కీడును గౌతమ్ శంకించారని సమాచారం.
ముఖ్యంగా తనంటే గిట్టని వాళ్లు చలో విజయవాడ విజయవంతాన్ని సాకుగా తీసుకుని సీఎం వద్ద వ్యతిరేకత పెంచారని గౌతమ్ నమ్ముతున్నారు. అంతేకాకుండా, ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగా పలకరించే సీఎం జగన్… ఈ నెల 3వ తేదీ తర్వాత ముభావంగా ఉండడం డీజీపీలో అనేక అనుమానాలు కలిగించిందని సవాంగ్ సన్నిహితులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తనపై సీఎం చల్లని చూపు పడేలా చూడాలని, కోపాన్ని పోగొట్టి మునుపటి సంబంధాలు కొనసాగేలా చేయాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములను డీజీపీ నేరుగా వేడుకున్నారని సమాచారం గత శనివారం శారదా పీఠాన్ని డీజీపీ సందర్శించారు. ఈ సందర్భంగా తన పదవికి ముప్పు వాటిల్లకుండా, పాలన సజావుగా సాగేలా స్వామి ఆశీస్సులు పొందినప్పటికీ… ప్రయోజనం లేకపోయింది.
రెండు రోజుల క్రితం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం వార్షిక మహోత్సవాలకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని డీజీపీ రెండురోజుల క్రితం చెప్పారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన జగన్‌కు వైసీపీ నేతలు కూడా శారదా పీఠాధిపతులతో సిఫార్సు చేయించే సంగతి తెలిసిందే.
డీజీపీ కొనసాగింపు విషయమై పీఠాధిపతులు సీఎంకు చెప్పారా? ఆయన వినలేదా? అనే విషయాలకు వారి మనసులకు మాత్రమే తెలుసు. కానీ శారద పీఠానికి డీజీపీ రావడం, ఆ తర్వాత రెండు రోజులకే బదిలీ వేటుకు గురైన నేపథ్యంలో భిన్న కథనాలు తెరపైకి వస్తున్నాయి.