సార్వత్రిక ఎన్నికలకు కచ్చితంగా మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. నిజానికి ఏపీలో చూస్తే 2019 ఎన్నికల వేడి అలాగే ఉంది. జగన్ సర్కార్ ని ఊపిరి తీసుకోనీయకుండా టీడీపీ పెద్దలు తెల్లారిలేస్తే విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి విధితమే.
ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున ఏపీలో అమలు చేస్తోంది. అలాగే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పయి లక్షల ఇళ్ళను నిర్మించేందుకు రెడీ అవుతోంది.
ఈ నేపధ్యంలో సర్కార్ మీద చిల్లర ఆరోపణలు చేస్తున్న తమ్ముళ్ళ పైన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఏ ఒక్క పధకంలో అయినా అవినీతి జరిగింది అని నిరూపించండి, నా పదవికి రాజీనామా చేస్తానంటూ అలుగుటయే ఎరుగని ధర్మరాజు లాంటి దాసన్న భారీ సవాల్ చేశారు.
అంతే కాదు పేద ప్రజల కోసం పధకాలు అమలు చేస్తూంటే ఈ రకమైన విమర్శలు ఏంటి అంటూ ఆయన మండిపడుతున్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని ఉప ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు.
ఆ ఎన్నికల్లో టీడీపీ మరోసారి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల అభ్యున్నతి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దానికి ఎవరు అడ్డుపడినా జనాలే తగిన గుణపాఠం చెబుతారని దాసన్న శాపనార్ధాలే పెట్టారు.