ఆయన ఎంతటి శాంతమూర్తో అంతటి ప్రళయ భయంకరుడు. భారతంలో చెప్పినట్లుగా అలుగుటయే ఎరుగని అజాత శత్రువు మాదిరిగా మెత్తగా ఉంటారు. కానీ ఆయనకు కోపం వస్తే అది ప్రళయ గర్జనే అవుతుంది అంటారు.
ఇక వివాదరహితుడు, మాట మీద నిలబడే వారు, జగన్ అంటే ఎంతో నిబద్ధత, ప్రేమ ఉన్న వారుగా చెబుతారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన క్రిష్ణ దాస్. జగన్ ఒంటరిగా కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఆయన్ని అనుసరించి వచ్చిన వారు క్రిష్ణదాస్. అందుకే జగన్ మెచ్చి మరీ డిప్యూటీ సీఎం గా పదోన్నత్రి కల్పించారు.
అంతే కాదు కీలకమైన రెవిన్యూ శాఖను కూడా అప్పగించారు. ఇవన్నీ ఇలా ఉంటే మరో రెండున్నరేళ్లల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో క్రిష్ణ దాస్ పోటీ చేయరని, రిటైర్ అవుతారని ఇప్పటిదాక రకరకాల పుకార్లు వినిపించాయి. ఆయన కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్య పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగింది.
అయితే వాటిని అన్నింటినీ తోసిపుచ్చుతూ మళ్ళీ నేనే అంటున్నారు క్రిష్ణ దాస్. తానే నరసన్నపేట వైసీపీ అభ్యర్ధిని అంటూ ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతే కాదు, ఏకంగా ఇరవై వేల పై చిలుకు మెజారిటీతో మరో మారు గెలిచి వస్తానని కూడా చెప్పుకున్నారు.
ఇక జగన్ చిత్తశుద్ధి కలిగిన నాయకుడు అని క్రిష్ణదాస్ పొగిడారు. అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు రాజకీయంగా దిగజారుడు విధానాలు అనుసరిస్తున్నారు అని మండిపడ్డారు. వరస ఓటములతో చంద్రబాబు ఇలా అయ్యారని కామెంట్స్ చేశారు.
బాబు ఇప్పటికైనా తన విధానాలు మార్చుకుని ప్రజల పక్షానపోరాడితే సంతోషిస్తామంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి జగన్ కి అతి సన్నిహితులైన క్రిష్ణ దాస్ వచ్చే ఎన్నికలలో తానే అభ్యర్ధి అంటూ వైసీపీలో తొట్టతొలిగా ప్రకటించుకుని రికార్డు సృష్టించారు అనే చెప్పాలి.